యువగళం పేరుతో పాదయాత్ర మొదలు పెట్టిన నారా లోకేశ్… కర్నూలు జిల్లాలో పూర్తి చేసుకని కడప జిల్లాలో అడుగు పెట్టనున్నారు. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడ్డా అయిన కడప జిల్లా జమ్మలమడుగు నియోజక వర్గంలోని సుద్దపల్లిలో లోకేశ్ ఎంటర్ కానున్నారు.
కర్నూలు జిల్లాలో ఏప్రిల్ 12న లోకేశ్ పాదయాత్ర ప్రవేశించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 40 రోజుల పాటు లోకేశ్ పాదయాత్ర చేశారు. ఇవాళ ఆళ్లగడ్డ మండలం చిన్నకందుకూరు వద్ద పాదయాత్రతో ఆ జిల్లాలో పాదయాత్ర ముగుస్తుంది. అక్కడి నుంచి కడప జిల్లాలోని జమ్మలమడుగులో ప్రవేశిస్తారు. జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఒకప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గుండ్లకుంట శివారెడ్డి హయాంలో జమ్మలమడుగులో టీడీపీ బలంగా వుండేది. ఆయన హత్యానంతరం వారసుడిగా రామసుబ్బారెడ్డి వచ్చారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు. 2014లో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి ఆ తర్వాత కాలంలో టీడీపీలో చేరారు.
ఆదినారాయణరెడ్డి రాకను రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదు. 2019లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి, కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి ఓడిపోయారు. వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి రాజకీయంగా వేర్వేరు దారులు ఎంచుకున్నారు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో, రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు.
ప్రస్తుతం రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ. జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు భూపేష్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టీడీపీతో పొత్తులో భాగంగా తనకు టికెట్ దక్కుతుందనే ఆశతో ఆది ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో లోకేశ్ పాదయాత్ర ఎంత వరకూ విజయవంతం అవుతుందో చూడాలి. లోకేశ్ విమర్శలు ఎవరి టార్గెట్‌గా ఉంటాయో అనే చర్చకు తెరలేచింది.