కృష్ణ లేకుండా ఆయన పుట్టినరోజు వస్తోంది. ఆ లోటుని పూడ్చడానికి మే 31న మోసగాళ్లకి మోసగాడు వస్తోంది. ట్రైలర్ భలే థ్రిల్ కలిగించింది. చిన్నప్పుడు ఆ అదృష్టం దక్కలేదు. 4 k ప్రింట్, 5.1 డిజిటల్ సౌండ్‌తో చూడడానికి 52 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. కృష్ణ అభిమానులకే కాదు, అందరికీ కూడా నచ్చుతుంది. కౌబాయ్ సినిమాని తెలుగులో చూసి చాలా కాలమైంది. తీసేవాళ్లు లేరు, కృష్ణ అంతటి నటులు లేరు. మహేశ్ ప్రయత్నించినా జనానికి ఎక్కలేదు.
కృష్ణ ప్రతి పుట్టిన రోజుకీ అనంతపురం నుంచి ఒక బ్యాచ్ వెళ్లేది. ఎండాకాలంలో ఆయన వూటీలో షూటింగ్ పెట్టుకునే వారు. అందరూ వెళ్లి వూటీ చూడడం, కృష్ణతో ఫొటోలు దిగడం, ఇక్కడికి వచ్చి అందరికీ చూపించడం అదో సరదా. మద్రాస్‌లో వుంటే మద్రాస్‌కి, హైదరాబాద్‌లో వుంటే హైదరాబాద్‌కి, ఎక్కడున్నా అభిమానులు ఆగేవాళ్లు కాదు. వాళ్లకి మే 31 ఒక పండుగ.
బి.కొత్తకోటలో షామీర్ అనే మిత్రుడున్నాడు. కృష్ణ పేరు చెబితే పూనకం. కృష్ణ పోయినపుడు కూడా విమానంలో వచ్చి మరీ నివాళి అర్పించాడు. మా చిన్నప్పుడు భవానీప్రసాద్ అని కృష్ణ పిచ్చోడు. ఆయన్ని చూడ్డానికి మద్రాస్ వెళ్లాడు. షంషేర్ శంకర్ షూటింగ్, కృష్ణ ఎవరితోనో మాట్లాడుతూ వుంటే తలుపు తోసుకుని మరీ వెళ్లాడు. కృష్ణ కోపంతో తిట్టాడు. తరువాత పిచ్చి అభిమానాన్ని అర్థం చేసుకుని భోజనం పెట్టించి పంపాడు. కృష్ణ తనని తిట్టాడని అదో గొప్ప సన్మానంగా భవానీప్రసాద్ అనంతపురమంతా చాటింపు వేసాడు.
శ్రావణ్ అనే మిత్రుడు చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోతే మద్రాస్‌లో కృష్ణ దంపతులు ఆదరించి ఇంట్లో పెట్టుకున్నారు. ఆ కృతజ్ఞతతో కొడుకుకి విమల్‌కృష్ణ అని పేరు పెట్టాడు. అతనే D.J టిల్లు దర్శకుడు.
ప్రతి సంవత్సరం జ్యోతిచిత్రలో సూపర్‌స్టార్ కూపన్ వస్తే స్టాల్స్‌లోని అన్ని కాపీలని కృష్ణ అభిమానులు కొని, కూపన్లు పంపేవాళ్లు. కృష్ణని అనేక సంవత్సరాలు సూపర్‌స్టార్ చేసింది అభిమానులే. 1978లో అన్నదమ్ముల సవాల్ అనే సినిమా వస్తే కృష్ణతో సమానంగా రజనీకాంత్ కటౌట్. అది తీసేయాలని గొడవ చేశారు. కేవలం కృష్ణ అభిమానుల కోసం హైదరాబాద్ నుంచి ఒక సినిమా పత్రిక కొంత కాలం వచ్చింది.
అనంతపురం రఘువీరా టాకీస్‌లో కృష్ణ సినిమాలు ఎక్కువగా వచ్చేవి. ఉదయం 8 గంటలకి మొదటి ఆట. తెల్లారి 6 గంటలకి పూలదండలతో కటౌట్‌ని అలంకరించి, టపాసులు పేల్చేవాళ్లు. బుర్రిపాలెం బుల్లోడు అనే సినిమా బాగాలేదని అన్నందుకు ఒకతన్ని చితకబాదారు.
ఇన్నేళ్లకి కృష్ణ సినిమా థియేటర్లో చూసే అవకాశం. ఎనిమిదేళ్ల వయసులో రాయదుర్గం ప్యాలెస్ థియేటర్లో నేల మీద కూచుని మోసగాళ్లకి మోసగాడు చూసాను. కృష్ణలా గుర్రం మీద తిరగాలనుకున్నా. మావూళ్లో గాడిదలు, జట్కా గుర్రాలు మాత్రమే వున్నాయి. దుర్మార్గుల్ని రివాల్వర్‌తో కాల్చాలనుకున్నా. దీపావళి తుపాకి మాత్రమే దక్కింది.
మే 31, మల్టీప్లెక్స్‌లో డిజిటల్ టెక్నాలజీతో మోసగాళ్లకి మోసగాడు చూడబోతున్నా. కానీ 1971 నాటి అమాయకత్వం ఎక్కడుంది? తెలివి, జ్ఞానం అన్నింటికీ మించిన శాపం, బాల్యం ఒక వరం. అది మళ్లీ రమ్మన్నా రాదు.
జీఆర్ మహర్షి