జగన్ లో నచ్చినదీ.. నచ్చనివీ..- జెపి

లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ నిర్మొహమాటి. తను నమ్మింది, నచ్చింది, భావించింది మాట్లాడేస్తారు. అందులో అస్సలు మొహమాటం లేదు. ఆయన గ్రేట్ ఆంధ్రకు దేశ పరిస్థితులు, రాజకీయాలు, సంస్కరణలు ఇలా పలు విషయాల మీద…

లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ నిర్మొహమాటి. తను నమ్మింది, నచ్చింది, భావించింది మాట్లాడేస్తారు. అందులో అస్సలు మొహమాటం లేదు. ఆయన గ్రేట్ ఆంధ్రకు దేశ పరిస్థితులు, రాజకీయాలు, సంస్కరణలు ఇలా పలు విషయాల మీద సుదీర్ఘమైన ఇంటర్వూ ఇచ్చారు. ఈ ఇంటర్వూలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ..

జగన్ లో తనకు మూడు విషయాలు నచ్చాయి అన్నారు.

ఒకటి. జనాలను నేరుగా పథకాలు డబ్బులు అందడం. గతంలో జనాలకు నేరుగా చేరకుండా మధ్యలోనే దారితప్పే పరిస్థితి వుండేదని, అయితే ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల జగన్ వాటిని నేరుగా లబ్దిదారులకు అందించగలుగుతున్నారని అన్నారు.

రెండు. గ్రామ సచివాలయాల వల్ల చాలా వరకు పనులు గ్రామాల్లోనే జరుగుతున్నాయని, ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పని వుండడం లేదన్నారు.

మూడు. జగన్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం తీసుకువచ్చిన కొత్త ఫింఛను పథకం అన్ని విధాలా బాగుందని అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలకు ఇది అనుసరించదగిన పింఛను పథకం అన్నారు. ఇలా చేయకపోతే రెండు దశాబ్దాల తరువాత ప్రభుత్వ ఆదాయం అంతా కేవలం పింఛన్ల చెల్లింపుకే సరిపోతుందన్నారు.

అలాగే విద్య, వైద్య రంగాల అభివృద్దికి కూడా జగన్ కొంత ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని, కానీ అది అంత ఎక్కువగా ఫలితాలు ఇస్తున్న దాఖలా లేదన్నారు.

ఇక..జగన్ లో నచ్చని విషయాలు ప్రస్తావిస్తూ.. 

ప్రత్యర్థులను ఏదో కేసుల్లో ఇరికించడం, జైలు పాలు చేయడం వంటివి తనకు నచ్చలేదన్నారు. రాజకీయాలు రాజకీయాలుగా చేయాలి కానీ వ్యక్తిగత కక్షలుగా మార్చ కూడదని అన్నారు. ఆ విషయం తనకు జగన్ లో నచ్చలేదని వివరించారు.