ఎన్టీఆర్‌కే కాదు…ప‌వ‌న్‌కూ ఓ ఘ‌న‌త‌!

న‌ట దిగ్గ‌జం నంద‌మూరి తార‌క‌రామారావు తెలుగుదేశం స్థాపించి, తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకున్నారు. రాజ‌కీయాల్లో పార్టీ పెట్టి కేవ‌లం తొమ్మిది నెల‌ల్లో అధికారాన్ని సొంతం చేసుకుని అరుదైన ఘ‌న‌త‌ను ఎన్టీఆర్ సొంతం చేసుకున్నారు.…

న‌ట దిగ్గ‌జం నంద‌మూరి తార‌క‌రామారావు తెలుగుదేశం స్థాపించి, తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకున్నారు. రాజ‌కీయాల్లో పార్టీ పెట్టి కేవ‌లం తొమ్మిది నెల‌ల్లో అధికారాన్ని సొంతం చేసుకుని అరుదైన ఘ‌న‌త‌ను ఎన్టీఆర్ సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ చ‌రిష్మా గురించి చెప్ప‌డానికి ఈ విష‌యాన్ని ప‌దేప‌దే చెబుతుంటారు. తెలుగు స‌మాజ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఎన్టీఆర్‌కు ప్ర‌త్యేక స్థానం వుంది.

ఎన్టీఆర్ మాదిరిగానే ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా సినిమా రంగం నుంచి వ‌చ్చారు. 2009లో మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా… ఆయ‌న ఎంతో కాలం నిల‌బ‌డ‌లేక‌పోయారు. కుళ్లు రాజ‌కీయాలు, దుష్ట‌ప‌న్నాగాల‌ను త‌ట్టుకోలేక ఆయ‌న చాలా త్వ‌ర‌గానే కాంగ్రెస్‌లో ప్ర‌జారాజ్యం పార్టీని విలీనం చేశారు. కేంద్ర మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకుని పొలిటిక‌ల్ కెరీర్‌ను ముగించారు. ఆ త‌ర్వాత తిరిగి సినీ రంగంలో కుదురుగా త‌న ప‌ని తాను చేసుకుంటున్నారు.

ప్ర‌జారాజ్యంలో యువ‌రాజ్యం అధినేత‌గా ప‌వ‌న్‌క‌ల్యాణ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. అయితే పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనాన్ని నిలువ‌రించ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత 2014లో జ‌న‌సేన పేరుతో ప‌వ‌న్‌కల్యాణ్ కొత్త పార్టీకి ఊపిరి పోశారు. ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌న్నారు. సొంతంగా పార్టీ అయితే స్థాపించాడే గానీ, ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌లేదు. దీనికి త‌న‌దైన భాష్యం ప‌వ‌న్ చెప్పారు. 2014లో ప‌వ‌న్ బ‌ల‌ప‌రిచిన టీడీపీ-బీజేపీ కూట‌మి ఇటు ఏపీలో, అటు కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చింది.

2019 వ‌చ్చే స‌రికి ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారిపోయాయి. వామ‌ప‌క్షాలు, బీఎస్పీతో క‌లిసి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎన్నిక‌ల‌కు వెళ్లారు. చివ‌రికి తాను నిలిచిన రెండు చోట్లా ప‌వ‌న్ ఓడిపోయారు. కేవ‌లం ఒకే ఒక్క చోట జ‌న‌సేన గెలుపొందింది. 2024 ఎన్నిక‌ల‌కు ఏడాది గ‌డువు వుంది. 

ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తొమ్మిది నెల‌ల‌కే అధికారాన్ని ద‌క్కించుకున్న ఘ‌న‌త సంపాదించుకోగా, ప‌వ‌న్ మాత్రం ప‌దేళ్లు అవుతున్నా ఇంకా ఎమ్మెల్యే కూడా కాని దుస్థితి. ఒక పార్టీ అధ్య‌క్షుడు ప‌దేళ్ల‌కు కూడా ఎమ్మెల్యే కాని ఘ‌న‌త బ‌హుశా ప‌వ‌న్‌కే ద‌క్కి వుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

జ‌న‌సేన‌ను స్థాపించి మ‌రొక‌రి ప‌ల్ల‌కీ మోస్తే, జ‌నం మాత్రం త‌న‌ను ఆద‌రిస్తార‌ని ప‌వ‌న్ ఎలా అనుకున్నారో మ‌రి! ప్ర‌జ‌ల‌కు దూరంగా, ఇత‌ర పార్టీల నేత‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటే ఎవ‌రికైనా ఇదే గ‌తి ప‌డుతుంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎపిసోడే నిలువెత్తు నిద‌ర్శ‌నం. ఏమైనా నెగెటివ్ కోణంలో చూస్తే… ప‌వ‌న్ కూడా ఘ‌న‌త సాధించార‌నే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికైనా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక పార్టీ అధినేత‌గా రాజ‌కీయం చేస్తే బాగుంటుంది.