ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏది చేసినా విమర్శించాలనే ఏకైక అజెండాతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ముందుకెళుతోంది. ఏడాదిన్నర క్రితం ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్న టీడీపీ …తానెందుకు ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న కనీస స్పృహ కూడా లేకపోయింది.
మరీ ముఖ్యంగా టీడీపీ అధినాయకుడు చంద్రబాబు ప్రతిరోజూ జగన్ సర్కార్‌పై దుమ్మెత్తి పోయడమే ఓ ఉద్యోగంగా పెట్టుకున్నారు. 40 ఏళ్ల రాజకీయంలో 14 ఏళ్ల పరిపాలనానుభవంతో ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇస్తామనే విచక్షణ ఆయనలో కొరవడింది.
తాజాగా తుపాను దెబ్బకు రైతులకు భారీ నష్టం సంభవించింది. పంటలు కోతకు వచ్చే సమయంలో నీట మునిగాయి. దీంతో రైతులకు పచ్చి కరవు వచ్చినట్టైంది.
ఈ నేపథ్యంలో తుపాను చేసిన విధ్వంసాన్ని పరిశీలించి, ఎలాంటి సాయం చేయాలో ఓ అంచనాకు వచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ మూడు జిల్లాల్లో ఏరియల్ సర్వే చేశారు. దీన్ని స్వాగతించడంతో పాటు బాధితులకు ఎలాంటి సాయం అందించాలో డిమాండ్ చేయాల్సిన చంద్రబాబు … ఆ పని చేయకుండా విమర్శలకు పని పెట్టారు.
వరద నీటి నిర్వహణ, బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ గాల్లో ప్రదక్షిణలు చేయడమే తప్ప కిందకు దిగి బాధితుల్ని పలకరించలేదన్నారు.
గత ఏడాది కృష్ణా గోదావరి నదులకు వరదలు వచ్చినప్పుడు జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఇప్పుడూ అదే నిరక్ష్యం కనిపిస్తోందన్నారు. పరిహారంపై మొక్కుబడి ప్రకటనలే తప్ప బాధితులకు రూపాయి ఇచ్చింది లేదన్నారు.
జగన్ గాల్లో ప్రదక్షిణల సంగతి సరే, మరి ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధితుల్ని పరామర్శించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? ఇంతకూ ఆయనేం చేస్తున్నట్టు? వరద బాధితులను కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పలకరించిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది.
భారీ వర్షాలకు, వరదలకు పంటలు సర్వనాశనమవుతున్నా … చంద్రబాబు మాత్రం కెమెరాలను వదిలి బయటకు మాత్రం రారు. ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు చేయడమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.