రేపట్నుంచి జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సన్నాహకంగా నిర్వహించిన టీడీపీఎల్పీ మీటింగ్ లో మొత్తం 15 ప్రశ్నల్ని తయారుచేశారు నేతలు నేతలు. ఆ పార్టీ ఇంకా దివాళాకోరు రాజకీయాలనే చేయాలనుకుంటోందనడానికి ఆ ప్రశ్నలే ప్రత్యక్ష ఉదాహరణలు.
నాయకుల్లో ఆత్మ విమర్శ లేదు, పార్టీ బాగుపడుతుందనే నమ్మకమూ లేదనడానికి ఈ ఆన్ లైన్ మీటింగే మరో సాక్ష్యం. టీడీపీ అడగాలనుకుంటున్న ప్రశ్నల కోసం అసెంబ్లీ వరకు వెళ్లాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. బలమైన వైసీపీ కార్యకర్త కూడా టీడీపీకి గూబ పగిలేలా సమాధానం ఇవ్వగలడు.
ఇంతకీ టీడీపీ ఏమడగాలనుకుంటోంది.. వాటికి వైసీపీ సమాధానాలు ఎలా ఉంటాయి..?
1. వరదల్లో రైతుల ఇబ్బందులు.. పంపు సెట్లకు మీటర్లు
నివర్ తుపాను నిజంగానే రైతుల్ని నిండా ముంచింది. అంతమాత్రాన పరిహారం విషయంలో టీడీపీలాగా సీఎం జగన్ తన-మన అని చూడటం లేదు. నష్టాన్ని మదింపు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఏరియల్ సర్వే ద్వారా తాను కూడా ఓ అంచనాకి వచ్చారు. మృతులకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తక్షణ ఆర్థిక సాయం కింద కూడా కొంత మొత్తం ఇస్తున్నారు.
ఇక వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే అంశంపై ఈ పాటికే రాష్ట్రంలోని రైతులకు ఓ క్లారిటీ వచ్చేసింది. ఒక్క రూపాయి కూడా రైతుల జేబుల్లో నుంచి చెల్లించాల్సిన అవసరం లేదని, బిల్లులన్నీ వారి ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత కూడా టీడీపీ ప్రశ్న అర్థం లేనిది. ఒకవేళ నిజంగానే ప్రభుత్వం కరెంటు మీటర్లు బిగించి రైతులను మోసం చేస్తే.. అంతకంటే స్వయంకృతాపరాథం మరోటి ఉండదు. అలాంటి తప్పు జగన్ ఎన్నిటికీ చేయరు.
2. టిడ్కో ఇళ్ల పంపిణీ, భూ సేకరణలో అవినీతి..
కోర్టుల్లో సమస్యలు లేని ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ డిసెంబర్ 25న మొదలు పెడతామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. భూసేకరణలో అవినీతి అంటూ కోర్టుల్లో కేసులు వేసిన చోట విచారణ జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో ఈ ప్రశ్న పూర్తిగా పాతపడిపోయిందే కానీ, దీనికి కొత్త జవాబు వెదకాల్సిన అవసరం లేదు.
3. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు.. ఆలయాలపై దాడులు
అసలీ దాడులు వ్యక్తిగతమైనవా, పార్టీపరమైనవా ముందు తేలాల్సి ఉంది. పూర్తిగా వ్యక్తిగతంగా జరిగిన దాడుల్ని వైసీపీకి అంటగట్టాలని తీవ్రంగా ప్రయత్నించి అభాసుపాలయ్యారు టీడీపీ నేతలు. ఆలయాలపై దాడులంటూ రేగిన కలకలాన్ని, తప్పుడు వార్తల ప్రచారాన్ని పోలీసులు సీరియస్ గా హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేశారు, రెచ్చగొట్టే వార్తల్ని ప్రచారం చేస్తున్నవారిపై కూడా చర్యలు తీసుకున్నారు.
4. పోలవరం నిర్లక్ష్యం.. ఎత్తు తగ్గించే ప్రయత్నం
ప్రాజెక్ట్ ని 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామంటూ డెడ్ లైన్ పెట్టి మరీ ప్రభుత్వం పని చేసుకుంటూ వెళ్తోంది. ఇక ఎత్తు విషయంలో చంద్రబాబుకే బంపర్ ఆఫర్ ఇచ్చారు వైసీపీ నేతలు. ఆయన టేప్ తెచ్చుకుని కొలుచుకోవచ్చని, ప్రారంభోత్సవం రోజున కొత్త బట్టలు కూడా పెడతామని చెప్పారు.
స్వయంగా కేబినెట్ భేటీలో కూడా జగన్ దీనపై విస్పష్టంగా ప్రకటన చేశారు. ఎత్తు ఒక సెంటిమీటర్ కూడా తగ్గదని భరోసా ఇచ్చారు. ఇంకా బాబు ఈ విషయంపై అసెంబ్లీలో రచ్చ చేయాలనుకోవడం అవివేకం.
5. ఇసుక దోపిడీ, మద్యం మాఫియా..
ప్రభుత్వం ఇసుక పాలసీ మార్చేసి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తోంది. ఇక మద్యపానం నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వాన్ని మద్యం మాఫియా పేరుతో విమర్శించడం అర్థ రహితం.
వైసీపీ పాలన పూర్తయ్యేనాటికి మద్య నిషేధం ఏ స్థాయిలో ఉందో అప్పుడు అడగాల్సిన ప్రశ్న అది. పైగా టీడీపీ కార్యకర్తలు, ఎల్లో మీడియా జనాలే మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ దొరికిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం.
6. రాజధాని రైతుల సమస్య..
దీనిపై కూడా కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి, మూడు రాజధానుల్ని, అభివృద్ధి వికేంద్రీకరణను చంద్రబాబు ఇంకా వ్యతిరేకిస్తే ప్రజల దృష్టిలో అభివృద్ధి కంటకుడిగా మిగిలిపోతారు తప్ప ప్రయోజనం లేదు. పైగా తనే కోర్టుల్లో కేసులు వేయించి, ఇప్పుడు తనే ఆ వ్యవహారాల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తే బాబుకు బుద్ధిచెప్పడానికి వైసీపీ సాక్ష్యాలతో సహా సిద్ధంగా ఉంది.
7. కరోనా వైఫల్యం..
దేశం మొత్తం కరోనా కట్టడి, కొవిడ్ నిర్థారణ పరీక్షలు, వైద్య సాయం విషయంలో ఏపీని ఆదర్శంగా తీసుకుంటుంటే.. చంద్రబాబుకి మాత్రం ఇక్కడ వైఫల్యం కనపడటం విచిత్రం, విడ్డూరం. పైగా కరోనా టైమ్ లో హైదరాబాద్ పారిపోయిన అపఖ్యాతి బాబుకు ఉండనే ఉంది.
8. నిత్యావసర ధరల పెంపు, పన్నుల పెంపు..
అధికారంలో ఎవరు ఉన్నా, లేకున్నా సహజంగా జరిగే ఇలాంటి పరిణామాలను ప్రభుత్వంపై రుద్దాలని చూడడం టీడీపీ దిగజారుడు రాజకీయం. కరోనా వేళ దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు పెరిగాయి. దీనికి తుపాన్లు, భారీ వర్షాలు ఆజ్యం పోశాయి.
9. రోడ్లపై గుంతలు, టోల్ ట్యాక్స్..
గతంలో టీడీపీ హయాంలో జరిగిన అవినీతికి నిదర్శనమే ఇప్పుడు రోడ్లపై పడుతున్న గుంటలు. ఏడాది టైమ్ పెట్టుకుని మరీ రోడ్ల రూపు రేఖల్ని పూర్తిగా మార్చేయాలని జగన్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో టీడీపీ చేస్తున్న ఆరోపణ పసలేనిదిగా మిగిలిపోతుంది.
10. పీపీఏల రద్దు, మూత పడుతున్న పరిశ్రమలు..
ఈ ప్రశ్నతో తమ హయాంలో కేవలం పీపీఏలకు మాత్రమే ఉత్సాహపడ్డామని, పరిశ్రమల నిర్మాణం జరగలేదని టీడీపీ ఒప్పుకున్నట్టవుతోంది. విశాఖ కేంద్రంగా ప్రతి నెలా పారిశ్రామిక ప్రగతిపై జరుగుతున్న సమావేశాలు చంద్రబాబుకి ఎందుకు కనిపించడంలేదో?
11. సంక్షేమ పథకాల రద్దు, పింఛన్ల పెంపుపై నిర్లక్ష్యం..
కేవలం కమీషన్ల కోసం, అస్మదీయుల కోసం టీడీపీ పెట్టిన సంక్షేమ పథకాల్ని కొనసాగించాల్సిన అవసరం వైసీపీకి ఎంతమాత్రం లేదు. కరోనా కష్టకాలం లేకపోయి ఉంటే.. ఈ పాటికే పింఛన్ల పెంపు అమలులోకి వచ్చి ఉండేది. హామీల అమలులో జగన్ కి ఎవరూ వంక పెట్టలేకపోతున్నారనే విషయం వాస్తవం.
అందుకే పింఛన్ల పెంపు ఆలస్యం అయినా, మరో రూపంలో ఆర్థిక సాయం అందుతుండే సరికి ప్రజలెవరూ ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదు. దీన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేయాలనుకుంటే గత ఎన్నికల ముందే ఆయనకు సడన్ గా గుర్తొచ్చిన పింఛన్ల పెంపుపై మరోసారి చర్చ జరగాల్సిందే.
12. నూతన ఇసుక పాలసీ, మైనింగ్ దోపిడీ..
పైన చెప్పుకున్న ఐదో పాయింట్ నే రిపీట్ చేశారు కానీ, కొత్తగా ఏమీ ఇందులో లేదు.
13. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు..
ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిగాకే బిల్లులు చెల్లిస్తామని ఈపాటికే జగన్ కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో ఈ ప్రశ్న అర్థరహితం.
14. మితిమీరిన అప్పు-దుబారా వ్యయం..
సంక్షేమ పథకాలకు ఆటంకం లేకుండా చూడటం కోసం చేస్తున్న అప్పుని కూడా జగన్ ఖాతాలో వేయాలని చూస్తున్నారు చంద్రబాబు. ఇక రివర్స్ టెండరింగ్ తో వేలకోట్లు ఆదా చేసిన, చేస్తున్న జగన్ పై.. దుబారా అనే నెపం నెట్టాలని చూస్తే.. చంద్రబాబు బహిరంగ సభలకు చేసిన ఖర్చు, చినబాబు ఎయిర్ పోర్ట్ స్నాక్స్ బిల్లుల సంగతి బైటకు తీయాల్సి ఉంటుంది.
15. స్థానిక ఎన్నికల నిర్వహణ..
నిమ్మగడ్డ, చంద్రబాబు కలసి ఆడుతున్న రాజకీయ డ్రామా స్థానిక ఎన్నికల తంతు అనే విషయం ప్రజలకు పూర్తిగా అర్థమైపోయిన తర్వాత కూడా ఇంకా ఈ ప్రశ్నతో టీడీపీ ఏం సాధిస్తుందో వారికే తెలియాలి.
మొత్తమ్మీద అసెంబ్లీలో ఈ 15 ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతామంటూ రెచ్చిపోతున్న టీడీపీ నేతలకు.. ఈ సమాధానాలు సరిగ్గా సరిపోతాయి? ఈమాత్రానికే అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం వారికి ఎంతమాత్రం లేదు.