గ్రేటర్ పోరు నేపథ్యంలో ప్రముఖ యాంకర్ ఉదయభాను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. ఆ వీడియో వైరల్ కావడానికి కారణం లేకపోలేదు. తెలుగు సమాజానికి యాంకర్‌గా ఉదయభాను సుపరిచితురాలు. మాటల మాంత్రికురాలు సుమ, ఝాన్సీ సమకాలికురాలైన ఉదయభాను యాంకరింగ్‌లో తనకంటూ ప్రత్యేకత శైలి ఏర్పరచుకుని గుర్తింపు పొందారు.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యం గురించి ఆమె ఓ వీడియో చేశారు. ఇందులో ఆమె సామాజిక పరిస్థితులను కళ్లకు కడుతూ చక్కటి తెలుగులో ఆకట్టుకునేలా చెప్పుకొచ్చారు. ఆ వీడియోలో ఆమె చెప్పిన ప్రధాన అంశాలు ఏంటంటే…
“సామాన్యుని స్వప్నం సాకారం అయిందా అంటే …మహానేతలంతా మహాద్భుతంగా మాట్లాడుతారు. ఎవరి మీడియా వారిది, ఎవరి మాధ్యమాలు వారివి. మాటల గారడీ, అంకెల గారడీతో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఏది నిజం? ఏది అబద్ధం? ఈ ప్రశ్నకు వేరే ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మన జీవితాలే సాక్ష్యం. సమాధానం మన మనస్సాక్షికి బాగా తెలుసు.
జీవితం ఒక యుద్ధమైతే, దాన్ని గెలవడానికి మనకున్న ఆయుధం ఓటు హక్కు. దాన్ని నిర్వీర్యం చేయొద్దు. కచ్చితంగా ఓటు వేసి తీరుదాం. అప్పుడే ప్రశ్నించగలం. పిడికిలి ఎత్తగలం. ఓటు మన స్వేదం, మన రుధిరం, మన భారతావని భవితం. కావున ప్రలోభాల కోసం కాదు ప్రగతి కోసం ఓటేద్దాం. ప్రజాస్వామ్నాన్ని కాపాడుకుందాం” అంటూ ఉదయభాను స్ఫూర్తిదాయక పిలుపునిచ్చారు.
ఉదయభాను ప్రస్తావించిన అంశాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవ స్థలో ఓటు ఆవశ్యతకత గురించి చెప్పడంతో పాటు దాన్ని అమ్ముకోవద్దని వేడుకోవడం వెనుక ఆవేదన స్పష్టంగా కనిపించింది. ఉదయభాను అన్నట్టు …అన్ని విషయాలు మన మనస్సాక్షికి బాగా తెలుసు. జీహెచ్ఎంసీ ఓటర్లు చేయాల్సిందల్లా మనస్సాక్షి ప్రబోధం మేరకు ఓట్లు వేయడమే.