సోము వీర్రాజుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తున్నారనే తెలియగానే ….టీడీపీ ఏదో కీడు శంకించింది. తమకేదో ఉపద్రవం ముంచుకొస్తోందని భయపడ్డట్టే జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బొమ్మాళీ నిన్ను వదలా అనే చందంగా వేటాడుతున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకోవాలని భావిస్తున్న చంద్రబాబునాయుడికి ప్రధాన ప్రత్యర్థి వైసీపీ కంటే, బీజేపీ నేతల నుంచే ఎక్కువ విమర్శలు వస్తుండడం చికాకు తెప్పిస్తోంది. మరీ ముఖ్యంగా సోము వీర్రాజు తెరపైకి వచ్చిన తర్వాత ఓ పథకం ప్రకారం తమపై మానసిక దాడి జరుగుతోందని టీడీపీ భావిస్తోంది.
ప్రతి అంశంలోనూ వైసీపీతో ముడిపెట్టి తమను కూడా తిట్టడం టీడీపీకి ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రజలు ప్రతిపక్షంలో కూచోపెట్టారని, చివరికి ఆ స్థానాన్ని కూడా మిగల్చకూడదనే అక్కసు ఆ పార్టీ నేతల విమర్శల్లో కనిపిస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
చంద్రబాబుపై తాజాగా సోము వీర్రాజు మరోసారి ఘాటు విమర్శలు చేయడాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తిరుపతిలో సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నాన్ రెసిడెన్షియల్‌గా నేతగా వ్యవహరిస్తున్నారని ధ్వజ మెత్తారు. ఆయనకు ప్రభుత్వం జీతం ఇచ్చే విషయమై ఆలోచించాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్ పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉంటుందని కేంద్రం నిర్ణయించినప్పటికీ చంద్రబాబు అత్యుత్సాహంతో అమరావతికి బలవంతంగా రాజధానిని తరలించారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉండడం విడ్డూరంగా ఉందన్నారు.
తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేతల నుంచి మరింత ఘాటుగా టీడీపీపై రాజకీయ దాడి జరిగే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే టీడీపీ పతన పునాదులపై బీజేపీ తన నిర్మాణాన్ని చేపట్టాలని గట్టిగా భావిస్తుండడమే.