కరోనా కారణంగా టాలీవుడ్ కు నష్టాలు వస్తే వచ్చి వుండొచ్చు. థియేటర్ల వ్యాపారం కుదలేయిపోయివుండొచ్చు. కానీ ఓటిటిలో విడుదలయిన దాదాపు అన్ని సినిమాలు భారీ నష్టాల భారి నుంచి మాత్రం కరోనా పుణ్యమా అని తప్పించుకున్నాయి.
ఒటిటిలో విడుదలయిన దాదాపు 99 శాతం సినిమాలు థియేటర్లో పడి వుంటే నిర్మాతలు లేదా బయ్యర్లు గుల్లయిపోయి వుండేవారు. అది పక్కా. ఆ విధంగా కరోనా కారణంగా ఓటిటికి వెళ్లి సేఫ్ అయిపోయారు. అందుకే ఇప్పుడు చాలా మంది నిర్మాతలు అర్జెంట్ మూలన వున్న డైరక్టర్లను బయటకు లాగి మరీ ఓటిటి సినిమాలు నిర్మిస్తున్నారు.
ఇదిలా వుంటే ఓటిటికి సినిమా ఇవ్వడం వల్ల మరో అదృష్టం ఏమిటంటే సినిమా హిట్ నా? ఫట్ నా? అన్నది తెలియకుండా దాచేయగలగడం. థియేటర్ లోకి వస్తే సినిమా నిగ్గు తేలుతుంది. అలా కాకుండా ఓటిటి లోకి వెళ్తే అది హిట్ నా కాదా అన్నది ఎవరికీ తెలియదు.
ఎందుకంటే ఓటిటికి వున్న సభ్యులు ఎలాగూ ఫ్రీ కాబట్టి చూస్తారు. అయితే ఎంత వరకు చూసారు. పూర్తిగా చూసారా? లేదా? అన్నది ఎక్కడా ఓ లెక్క పత్రం వుండదు. ఓటిటిలు ఈ అంకెలు ఎక్కడా ప్రకటించవు.
అమెజాన్ కావచ్చు, నెట్ ఫ్లిక్స్ కావచ్చు, హాట్ స్టార్ కావచ్చు. ఏవీ కూడా తాము కొన్న సినిమాలకు ఎన్ని మినిట్ వ్యూస్ వచ్చాయి అన్నది పబ్లిక్ గా ప్రకటించడం చాలా అరుదు. పైగా కొన్ని మిలియన్ల మినిట్ వ్యూస్ ను గంటల్లోకి, అలాగే సినిమా నిడివి కిందకు కుదించి లెక్క పెడితే గట్టిగా నాలుగైదు లక్షల వ్యూస్ దాటవు.
కానీ ఈ లోగా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ భజన సాగిపోతుంది. ఫోన్ లు చేసి, రిక్వెస్ట్ చేసి మరీ ట్వీట్ లు వేయించుకోవడం వంటి కార్యక్రమాలు జోరుగా సాగుతుంటాయి.
దీంతో సినిమా హిట్ అని ఎవరికి వారు సంబరాలు చేసేసుకుంటూ, సంతృప్తి చెందుతూ వుంటారు. సినిమాకు అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కొలమానం థియేటర్ వసూళ్లే. యావరేజ్ రేటింగ్ లు వచ్చినా, జనం ఆదరించి కాసులు కురిపించి హిట్ చేసిన సినిమాలు వున్నాయి.
అలా అని రేటంగ్ లు వచ్చినా జనం పక్కన పెట్టిన సినిమాలు వున్నాయి. మళ్లీ థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ఇక ఇలాంటి సోషల్ మీడియా హిట్ లకు ఇక బ్రేక్ పడకతప్పదేమో?