దేశ మీడియాలో తెలుగు మీడియాది భిన్నపోకడ. ప్రజల కోసం పనిచేయవలసిన మీడియా ఒక పార్టీకోసం నిత్యం పనిచేయటం ,బాహాటంగానే ఒక నాయకుడిని భుజాల మీద మోయటం గత రెండు దశాబ్దాలుగా జరుగుతుంది.
జగన్ మోహన్ రెడ్డి రూపంలో ఎదురైన సవాల్ ను రాజకీయంగా ఎదుర్కొనలేక ఆయన వ్యక్తిత్వ హనన ప్రయత్నం చేసిన మీడియా 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ గెలుపును అడ్డుకోలేకపోయింది.
కౌంటింగ్ మొదలైన మొదటి ముప్పై నిమిషాలకే వైసీపీ కి భారీ ఆధిక్యం వస్తుందన్న ట్రెండ్స్ వచ్చినా దింపుడు కళ్ళం ఆశలాగా టీడీపీ గెలుస్తుందని, పలానా నియోజక వర్గంలో ఆధిక్యతలో ఉందని గంటల తరబడి విశ్లేషణలు ప్రసారం చేశారు.
పద్నాలుగు నెలలు పాదయాత్రతో జగన్ కు ప్రజలతో ఏర్పడ్డ ప్రత్యక్ష సంబంధాలతో ,ప్రజలకు ఏమి కావాలో స్వయంగా తెలుసుకున్న జగన్ పాలనలో “నవరత్నాల” పేరుతో సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ దళారి వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోకే డబ్బులు వేస్తున్నారు .
గ్రామ వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయం ఉద్యోగ వ్యవస్థతో షుమారు మూడున్నర లక్షల మంది యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు .ప్రపంచంలో ఎక్కడా కూడా ఒకేసారి ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం లేదు.
అయినా కానీ తెలుగు మీడియాలో వీటి మీద వార్తలు రావు. తెల్లవారక ముందే వాలంటీర్లు వృద్ధాప్య పింఛన్లు ఇళ్లకు వెళ్లి ఇస్తున్నా దాని మీద వార్త ఉండదు. పైగా ఎక్కడైనా ఒకటి అరా తప్పులు జరిగితే వాటిని మాత్రం బ్యానర్ ఐటమ్ పెట్టి రాస్తారు.
సోషల్ మీడియానే బలం …
అసత్యాలను,అర్ధ సత్యాలను ప్రచారం చేస్తున్న ఒక వర్గం మీడియాను ఎదుర్కోవటానికి జగన్ అభిమానాలు, వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా ను వేదికగా ఎంచుకున్నారు.
ప్రభుత్వం చేస్తున్న పనులను,పథకాలను ప్రచారం చేస్తూనే ,ప్రత్యర్థి పార్టీ అనుకూల మీడియాలో వచ్చే అసత్య వార్తలకు, కథనాలకు నిర్మాణాత్మక కౌంటర్ లతో సమాధానాలు ఇచ్చే వారు రాసే ఆర్టికల్స్ షేర్ చేయటం, గ్రూపుల్లో చర్చకు పెట్టటం ,బలంగా వాదన వినిపిస్తూ ప్రత్యర్థుల దుష్ప్రచారాలను తిప్పికొడుతూ వచ్చారు .
పింఛన్ పంపిణీ చేసే ఒకటో తారీకు కావచ్చు, ఏదైనా సంక్షేమ పథకం నగదు పంఫిణీ కావచ్చు, ఒక శంకుస్థాపన కావచ్చు.. సోషల్ మీడియాలో వైసీపీ క్యాడర్ హోరెత్తిస్తుంది.. కొన్ని లక్షల మందిని చేరేలా చేసి సోషల్ మీడియా ట్రేండింగ్ లో నెంబర్ 1 గా ఉండేలా చూస్తారు.
అనేక సందర్భాలలో సోషల్ మీడియాలో జరిగిన చర్చను ప్రధాన మీడియాలో కౌంటర్ చేసుకుంటూ కొత్తపలుకులు రాసుకున్నారు.
మోడీ నెంబర్ 1,జగన్ నెంబర్ 2
సోషల్ మీడియాలో ట్రెండ్స్ ను విశ్లేషించే “చెక్ ట్రెండ్స్” అనే సంస్థ ఈ రోజు విడుదల చేసిన రిపోర్ట్ లో ప్రధాని మోడీ మొదటి స్థానంలో ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచారు.
ఈ సంస్థ గత మూడు నెలల కాలంలో 95 మంది ముఖ్యమైన రాజకీయ నాయకుల మరియు వివిధ రంగాలకు చెందిన 500 మంది ప్రాముఖ్యల ట్రెండ్స్ ను మొత్తంగా 10 కోట్ల ఆన్లైన్ ఇంప్రెషన్స్ (లింక్ ను చూసిన వారి సంఖ్య)ను విశ్లేషించి మోడీ ,జగన్ మొదటి స్థానాల్లో ఉన్నట్లు ప్రకటించింది. మోడీ 2,171 ట్రెండ్స్ తో మొదటి స్థానంలో ఉండగా జగన్ 2,137 ట్రెండ్స్ తో అంటే మోడీ కన్నా కేవలం 34 ట్రెండ్స్ తేడాతో రెండవ స్థానంలో నిలిచారు.
యోగి ఆదిత్యనాథ్, నితీష్ కుమార్, శివరాజ్ సింగ్ చౌహన్ లాంటి పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నిత్యం మీడియాలో కనిపించే ఉద్ధవ్ థాక్రే .మమతా బెనర్జీ,అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారిని దాటి జగన్ రెండవ స్థానంలో నిలిచాడంటే ఆయన పథకాలు,పాలన నిర్ణయాలు ఏ స్థాయిలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయో అర్థంచేసుకోవచ్చు.
కలిసొచ్చిన డిజిటల్ మీడియా కార్పోరేషన్ ….
సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు మొదటి నుంచి దూకుడుగా వున్నా సరైన సమయంలో సరైన కంటెంట్ దొరక్క ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. క్యాంపైన్ అసంఘటితంగా ఉండేది.
జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రభుత్వ పథకాల ప్రచారానికి ,సంక్షేమ పథకాల మీద ప్రజలకు అవగాహన పెంచాలన్న ఉద్దేశ్యంతో డిజిటల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు.
డిజిటల్ మీడియా ఏర్పాటు తరువాత కంటెంట్ కోసం చూసుకోవలసిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు డేటా మరియు పోస్టర్ లను డిజిటల్ మీడియా అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటం జగన్ సోషల్ మీడియా ట్రెండ్స్ లో రెండవవ స్థానం లో నిలవటానికి దోహదం చేసింది.
భవిషత్తు సోషల్ మీడియాదే ….
ప్రధాన మీడియా ను దాటి సోషల్ మీడియా ప్రభావం చూపుతుండటంతో ప్రభుత్వాలు,రాజకీయ పార్టీలు సోషల్ మీడియా మీద దృష్టి పెట్టాయి. దుబ్బాకలో బీజేపీ ఆశ్చర్యకర విజయంలో సోషల్ మీడియాదే ప్రధాన పాత్రన్న అభిప్రాయం ఉంది.
ప్రతిపార్టీ పొలిటికల్ కన్సల్టెంట్స్ ను నియమించుకొని సోషల్ మీడియా టీమ్ ను నిర్మించుకుంటున్నాయి. బలమైన క్యాడర్ ,బూత్ కమిటీలు ఉన్నాయని చెప్పుకునే టీడీపీ కూడా సోషల్ మీడియాలో పనిచేయటానికి ఆసక్తికలవారు కావాలని పత్రికల్లో ప్రకటించటం సోషల్ మీడియా ప్రాధాన్యతను సూచిస్తుంది. రాబోయే రోజుల్లో మైకులు,ఫ్లెక్సీల కన్నా పోస్టర్లు, మీమ్స్ మీదనే పార్టీలు దృష్టి పెట్టటం ఖాయం.