అసలు మన దేశంలో కులాంతర వివాహాలకే జనాలు ఇంకా పూర్తి స్థాయిలో ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇలాంటి అంశాల్లో పరువు హత్యలను చూస్తున్నాం. ఒకవైపు పరువు హత్యలు చట్ట ప్రకారం నేరం అవుతున్నాయి. ఆ కేసుల పట్ల ప్రభుత్వాలు కఠినంగా స్పందిస్తున్నాయి.
యుక్త వయసుకు వచ్చి, చట్ట ప్రకారం మేజర్లు అయిన వారు తమకు ఇష్టం వచ్చిన వారిని ఎంచుకుని పెళ్లి చేసుకునే సౌలభ్యాన్ని ఇచ్చింది మన రాజ్యాంగం. కులం, మతాలను ప్రతిష్టగా భావించే భారత దేశంలో పెళ్లి విషయంలో వ్యక్తి స్వేచ్ఛ అనేక సార్లు ప్రశ్నార్థకం అవుతుంటుంది.
పిల్లల ప్రేమ పెళ్లిళ్లకు కులం అడ్డంకి ఉన్నప్పుడే కాదు, సొంత కులంలోనే ప్రేమ పెళ్లిని చేసుకున్నా ఆమోదించని తల్లిదండ్రులు కోకొల్లలు! పిల్లలను తమ పరువుగా చూడటంతో.. పక్కింట్లో ఉన్న సొంత కులం వాడి విషయంలో అయినా అభ్యంతరాలు ఉండనే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడు కాస్త మార్పు వస్తోందని అనుకున్నా.. ఇంతలోనే వార్తల్లోకి ఎక్కే పరువు హత్యలు పరిస్థితి ఏమీ మారలేదని స్పష్టం చేస్తూ ఉంటాయి.
దక్షిణాదినే కాదు, ఉత్తరాదినా ఈ గొడవలకు లోటు లేదు. ఉత్తరాదినే పరువు హత్యలు మరింత ఎక్కువ కూడా! దశాబ్దం కిందటే అక్కడ పరువు హత్యలు పతాక స్థాయికి చేరాయి.
అక్కడ కూడా కులాంతర వివాహాల విషయంలోనే పరువు హత్యలు జరుగుతున్నాయి. ఇంతలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లవ్ జిహాద్ అంటూ, లవ్ జిహాద్ ను నిరోధించడానికి చట్టాలు తెస్తున్నట్టుగా ప్రకటించారు! హిందూ అమ్మాయిలను మతం మార్చి ముస్లిం అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకోవడానికి వ్యతిరేకంగా ఈ చట్టాలు తెస్తున్నారట.
అయితే తాజాగా యూపీలోని అలహాబాద్ హై కోర్టు ఇలాంటి కేసు ఒక దాన్ని కొట్టేసింది. ఒక హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకున్నాడట, ఆమె మతం మారి పేరు మార్చుకుందట, దీనిపై కేసు నమోదు కాగా.. వారు మేజర్లు అని, వారి ఇష్టపూర్వకంగా బతికే హక్కు వారికి ఉందని స్పష్టం చేస్తూ కేసు కొట్టి వేసింది న్యాయస్థానం!
ఇటీవలే మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పందిస్తూ.. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టం చేయబోతున్నట్టుగా ప్రకటించింది. మనుషుల్లో పుట్టే ప్రేమను, లేచి పోయి చేసుకునే పెళ్లిళ్లను చట్టాలు ఆపుతాయా? సాంకేతికంగా అయినా ఏది లవ్ జిహదో, ఏది ప్రేమో.. నిరూపించడం ఎలా సాధ్యం అవుతుంది? అనేవి శేష ప్రశ్నలు!
మరి ఇదే సమయంలో.. చట్టాలు కేవలం లవ్ జిహాద్ లకు వ్యతిరేకంగా మాత్రమేనా? లేక కులాంతర వివాహాలకు వ్యతిరేకంగా కూడానా? తమ మతం అని ఆలోచించేవాడికి మతాంతర వివాహాలు తప్పనిపించవచ్చు,
అదే తమ కులం అని ఆలోచించే వాడికి కులాంతర వివాహాలు ఏ స్థాయి తప్పులో చెప్పనక్కర్లేదు! కాబట్టి దయ గల ప్రభుత్వాలు.. అన్ని కులాంతర వివాహాలకు వ్యతిరేకంగా చట్టం చేసేసి.. ఏ కులం వాడు ఆ కులంలో మాత్రమే పెళ్లి చేసుకోవాలి.. లేకపోతే అంతు చూస్తామంటూ చట్టాలు చేస్తే పోలా! చలో మధ్యయుగం!