పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించే విషయంలో రెండు రోజుల్లోనే విభిన్నంగా ప్రవర్తించింది ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్. ప్రభుత్వం ఆదేశాలతో అలా చేసిందా లేక, తానే సొంత నిర్ణయం తీసుకుందా తెలియదు కానీ.. పోలవరం వ్యవహారానికి అనవసర ప్రాధాన్యం దక్కేలా చేసిందనే విషయం మాత్రం వాస్తవం.
రెండు రోజుల క్రితం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో పోలవరం పరిరక్షణ యాత్ర పేరుతో కొంతమంది హడావిడి చేశారు. అయితే వీరిని అడ్డుకుని పోలీసులు అంతకంటే పెద్ద సీన్ క్రియేట్ చేశారు. పోలవరం నిషిద్ధ ప్రాంతమా? అక్కడికి ఎవరినీ వెళ్లనీయరా? అంటూ చంద్రబాబు అడ్డదిడ్డంగా మాట్లాడేందుకు వీలు కల్పించారు.
కట్ చేస్తే తర్వాతి రోజు.. వైసీపీ నేత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ జనచైతన్య వేదిక నాయకులతో కలసి పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించారు. వీరికి ఎలాంటి అడ్డంకులు లేవు, అనుమతులు కూడా అవసరం లేకుండానే పని జరిగిపోయింది. స్పిల్ వే పనులు, కాఫర్ డ్యాం పనులు పరిశీలించిన డొక్కా బృందం.. జగన్ హయాంలో పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయని కితాబిచ్చారు.
జగన్ ని పొగడాలంటే అంతదూరం వెళ్లాల్సిన పనిలేదు. పైగా వైసీపీ నాయకులు జగన్ ని పొగిడినా, పోలవరం పనుల వేగాన్ని ప్రశంసించినా ఎవరూ పట్టించుకోరు. అదే పని సీపీఐ చేస్తే ఆ లెక్క వేరు.
వాస్తవానికి పోలవరం పరిరక్షణ యాత్ర పేరుతో వస్తున్నవారి కోసం మేఘా ఇంజినీరింగ్ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. వారికి మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేసి, ఫొటో గ్యాలరీ ప్రదర్శన కూడా సిద్ధం చేసింది. పనుల్ని వివరించడానికి ఇంజినీర్ల బృందాన్ని కూడా సిద్ధం చేసుకుంది.
సీపీఐ నేతలు పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతాన్ని సందర్శించి ఉంటే.. అక్కడ జరుగుతున్న వాస్తవాల్ని కప్పిపుచ్చే సాహసం చేసేవారు కాదు. పైగా ప్రజా సంఘాలను కూడా వెంట బెట్టుకుని వెళ్తున్నారు కాబట్టి, ఏకపక్షంగా మాట్లాడే అవకాశం లేనే లేదు.
గతంలో ఎంతవరకు పనులు జరిగాయి, ఇప్పుడు ఏం జరుగుతున్నాయే విషయం కనీసం ఇంజినీర్లు.. సీపీఐ నాయకులకు వివరిస్తున్న వ్యవహారమైనా ప్రజలకు తెలిసేది కదా? అంత మంచి అవకాశాన్ని ఎందుకు చేజార్చుకున్నట్టు?
కేవలం పోలీసులు అత్యుత్సాహంతో వారిని అడ్డుకోబట్టే వ్యతిరేక ప్రచారం జరిగింది. పోలవరం వద్దకు ఎవర్నీ పోనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ, ప్రాజెక్ట్ సైట్ వద్ద ఏదో జరగరానిది జరిగిపోతోంది అంటూ ప్రతిపక్షాలు విమర్శించడం మొదలు పెట్టాయి. పోలీసులు వారిమానాన వారిని వదిలేసి ఉంటే.. అనవసర ప్రాధాన్యం ఇవ్వకుండా ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది.
ఇప్పటికే రాష్ట్ర పోలీస్ డిపార్ట్ మెంట్ పై ప్రతిపక్షాలు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నాయి. వైసీపీ చెప్పినట్టల్లా ఆడుతున్నారంటూ ఏకంగా ఉన్నతాధికారుల్నే టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు. సమస్యలు వస్తాయా లేదా అని అంచనా వేసుకోకుండా ప్రతిపక్షాల ప్రదర్శనలు ఇలా నిలువరించుకుంటూ పోతే.. సామాన్య ప్రజలు కూడా ఆ అపవాదే నిజం అనుకునే ప్రమాదం ఉంది. ప్రతిపక్షాలకు లేని పోని ప్రచారం కల్పించినట్టవుతుంది.