ప్రధాని మోడీ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు రావడం విశేషం. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు సోషల్ మీడియా టాప్ ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్ సంస్థ అధ్యయనం చేసి ఓ నివేదిక వెలువరించింది.
ఈ మూడు నెలల్లో దేశంలో 95 మంది టాప్ పొలిటికల్ లీడర్లు, 500 మంది అత్యున్నత ప్రభావితం చేయగల వ్యక్తులకు సంబంధించి వివిధ సోషల్ మీడియా వేదికల్లో ట్రెండ్స్‌ను ఆ సంస్థ విశ్లేషించింది.
ఈ విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వైసీపీ శ్రేణులు కెవ్వుమని కేక వేసేలా ఫలితాలు వెల్లడయ్యాయి. దాదాపు 10 కోట్ల ఆన్‌లైన్ ఇంప్రెషన్స్ ఆధారంగా ఈ తొలి నివేదికను వెల్లడించింది.
ట్విటర్, గూగుల్ సెర్చ్, వికీ, యూట్యూబ్‌ల్లో అత్యధిక ట్రెండ్స్ ప్రధాని మోడీ పేరుపై ఉన్నాయి. ఆ తర్వాత స్థానం జగన్ దక్కించుకోవడం జాతీయస్థాయిలో ఆయన ఇమేజ్‌ను తెలియజేస్తోంది.
ఈ నివేదిక ప్రకారం.. 2,171 ట్రెండ్స్‌తో మోదీ తొలి స్థానంలో నిలిచారు. మోడీతో దాదాపు సమానంగా 2,137 ట్రెండ్స్‌తో వైఎస్ జగన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉండడం గమనార్హం. జాతీయ స్థాయిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాపులారిటీ పెరగడానికి కారణం లేకపోలేదు.
సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జితో పాటు నలుగురు హైకోర్టు న్యాయమూర్తులపై గత నెలలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు జగన్ ఫిర్యాదు చేయడంతో పాటు దాన్ని బహిర్గతపరిచారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఏపీ సీఎం జగన్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది.
బహుశా జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, న్యాయస్థానాల్లో చోటు చేసుకునే అంశాలు జగన్ పాపులారిటీ పెరగడానికి దోహదం చేసి ఉంటాయి.