గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తున్నాయి. అయితే గ్రామీణ, పట్టణ, నగర ఓటర్ల ఆలోచనా విధానంలో తప్పకుండా తేడా ఉంటుంది.
ప్రస్తుతం నగర ఓటర్ల మనసు గెలుచుకోవాలంటే అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా తప్పక ప్రభావం చూపనున్నాయి.
విద్య, ఉద్యోగ, వ్యాపార, ఉపాధి అవకాశాల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యిన వారి సంఖ్య గణనీయంగా ఉంది. జీహెచ్ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే తప్పని సరిగా అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొనాల్సి వుంటుంది.
గ్రేటర్ తండ్లాట ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా? నేనా? అనే రేంజ్లో సాగుతోంది. దీంతో ప్రతి ఓటూ ఎంతో కీలకమనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 150 సీట్లకు గాను 150, బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 106, ఎంఐఎం 51 స్థానాల్లో ప్రధానంగా బరిలో నిలిచాయి. వీటిలో టీడీపీ దాదాపు 30 స్థానాల్లో గెలుపోటములను డిసైడ్ చేసే స్థితిలో ఉందంటున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీకి ఇటు చెంపేటు, అటు గోడేటు అనే చందంగా ఏపీ రాజకీయాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రెండురోజుల క్రితం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు దివంగత వైఎస్సార్ మరణంపై అవాకులు చెవాకులు పేలడం ఊహించని నష్టాన్ని తెస్తుందనే భయం బీజేపీ శ్రేణుల్లో నెలకొంది.
అలాగే అమరావతి విషయంలో బీజేపీ దొంగ నాటకాలు ఆడుతోందని కోస్తాకు చెందిన ప్రజలు గుర్రుగా ఉన్నారు. గ్రేటర్లో రాయలసీమతో పాటు కోస్తా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.తమ ప్రియతమ నేతపై రఘునందన్‌రావు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని వైసీపీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు జీర్ణించుకోలేకున్నారు.
ఈ ప్రభావం గ్రేటర్ ఎన్నికలపై తప్పక తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని , ఆ పార్టీ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లను బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఏపీ రాజధాని విషయంలో వెనుక నుంచి నాటకాలు ఆడుతూ, ఏమీ తెలియనట్టు బీజేపీ వ్యవహరిస్తోందని కోస్తా ప్రాంత ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ వైఖరికి నిరసనగా ఏపీలోని ప్రధాన పాలక ప్రతిపక్ష పార్టీల మెజార్టీ అభిమానులు ఇటు టీడీపీ లేదా టీఆర్ఎస్ను ఎంచుకునే అవకాశాలున్నాయి. ఇవే ఇప్పుడు తమ విజయావకాశాలను నిర్దేశించే అవకాశాలున్నాయని బీజేపీ భావిస్తోంది. గ్రేటర్ ఓటర్ నాడిలో ఏముందో తెలుసుకునేందుకు వచ్చే నెల 4వ తేదీ వరకు వేచి వుండక తప్పదు!