గెలిచే గుర్రాలను ప్రశాంత్ కిషోర్ ఎక్కుతున్నాడా, ప్రశాంత్ కిషోర్ ఎక్కే గుర్రాలు గెలుస్తాయా.. అనేది అంత తేలికగా తేల్చేయగలిగిన అంశం కాదు. మనిషికి టైం బాగున్నప్పుడు అలాంటి డీల్స్ దొరుకుతాయి కాబోలు. రాజకీయాల్లో పీకే ఒక సుడిగాడు. అంతవరకూ థర్డ్ పార్టీ స్ట్రాటజిస్టులకు రాజకీయాల్లో స్థానమే లేదు. రాజకీయ నేతలంటేనే వారు తలపడిన వాళ్లు, వారి నీడన మరొకరు ఎన్ని సలహాలు ఇచ్చినా ఎదగడం కష్టమే అనే అభిప్రాయాలు సర్వత్రా ఉన్న దశలో పొలిటికల్ స్ట్రాటజిస్టుగా సంచలన గుర్తింపును సొంతం చేసుకుంటూ సాగుతున్నాడు పీకే.
ముందుగా మోడీకి స్ట్రాటజిస్టుగా పని చేసి, ఆ పై నితీష్ కుమార్ ను సీఎంగా చేశాడనే పేరును కలిగి ఉన్న పీకే ఖాతాలో..వైఎస్ జగన్ విజయం కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పీకే సలహాలు ఏ మేరకు ఉపకరించాయి, వైసీపీ విజయంలో వాటి పాత్ర ఎంత.. అనేది అంత తేలికగా తేల్చలేరు. ఆ పార్టీలోని కొందరు పీకేని తక్కువ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు, ఇప్పటికీ వారు అవే అభిప్రాయాలతో ఉన్నారు. అయితే అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం పీకే టీమ్ మీద విశ్వాసం ఉంచారు.
అలా పీకే లక్కీ సెంటిమెంట్ మీద ఇప్పుడు ఇతర పార్టీలు కూడా ఆశలు పెట్టుకుంటున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీల కోసం పీకే పని చేస్తూ ఉన్నాడని తెలుస్తోంది. వీరిలో కేజ్రీవాల్ ఊపు మీద కనిపిస్తున్నారు ఢిల్లీలో. మరోవైపు దక్షిణాది ప్రాంతీయ పార్టీలు పీకే పేరు కలవరిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా జేడీఎస్ వాళ్లు ఒప్పందం ప్రయత్నాల్లో ఉన్నారట, మరోవైపు డీఎంకే పీకేతో ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది.
తమిళనాట ఇప్పుడు డీఎంకేకు ఊపు కనిపిస్తూ ఉంది. లోక్ సభ ఎన్నికల్లోనే సత్తా చూపిన ఈ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించే అవకాశాలున్నాయి. రజనీ, కమల్ లు రంగంలోకి దిగినా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ కే మొగ్గు ఉండవచ్చు. ఇలాంటి నేపథ్యంలో పీకేని కూడా కలుపుకుని స్టాలిన్ ఆ అవకాశాన్ని కూడా వదలకుండా వ్యవహరిస్తున్నాడు. స్టాలిన్ గనుక పీకేతో ఒప్పందం చేసుకోకుంటే.. రజనీనో, కమలో ఆయనతో చేతులు కలపవచ్చు. ఏదేమైనా.. పీకేకి మాత్రం ఎనలేని డిమాండ్ కనిపిస్తూ ఉంది.