తిరుప‌తిలో ప‌ర‌ప‌తి పెంచుకునే ప‌నిలో బీజేపీ

తిరుప‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో త‌న ప‌ర‌ప‌తిని పెంచుకునే ప‌నిలో బీజేపీ నిమ‌గ్న‌మైంది. దుబ్బాక‌లో బీజేపీ సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో, అది కాస్తా ఏపీ బీజేపీ నేత‌ల‌పై స‌హ‌జంగానే ఒత్తిడి పెంచుతోంది. Advertisement…

తిరుప‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో త‌న ప‌ర‌ప‌తిని పెంచుకునే ప‌నిలో బీజేపీ నిమ‌గ్న‌మైంది. దుబ్బాక‌లో బీజేపీ సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో, అది కాస్తా ఏపీ బీజేపీ నేత‌ల‌పై స‌హ‌జంగానే ఒత్తిడి పెంచుతోంది.

తిరుప‌తి ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్‌రావు ఆక‌స్మిక మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే టీడీపీ త‌మ అభ్య‌ర్థిగా ప‌న‌బాక ల‌క్ష్మి పేరును ఖ‌రారు చేసింది. వైసీపీ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ గురుమూర్తి పేరు ఖ‌రారైన‌ట్టు అన‌ధికారిక స‌మాచారం. ఇక బీజేపీ త‌ర‌పున పోటీ చేసేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతున్న‌ట్టు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌తో క‌లిసి బీజేపీ త‌న అభ్య‌ర్థిని నిల‌ప‌నుంది. ఎలాగైనా తిరుప‌తిలో త‌న స‌త్తా చాటాల‌ని బీజేపీ త‌హ‌త‌హ లాడుతోంది. దేశ వ్యాప్తంగా మోడీ హ‌వా కొన‌సాగుతున్న నేప‌థ్యంలో, దాన్ని సొమ్ము చేసుకునేందుకు ఏపీ బీజేపీ వ్యూహ ర‌చ‌న చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు  ఓ టీంను ఎంపిక చేసి, తిరుప‌తిలో ఉంటూ కార్యాచ‌ర‌ణ అమ‌లు చేసేందుకు సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో సోము వీర్రాజుకు న‌మ్మ‌క‌స్తుడైన ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ఇప్ప‌టికే త‌న మకాంను తిరుప‌తికి మార్చారు. టీవీ డిబేట్ల‌తో ప్రత్య‌ర్థులు ఎంటి వారైనా దీటైన వాద‌న‌ల‌తో పార్టీ వాయిస్‌ను బ‌లంగా వినిపిస్తార‌నే గుర్తింపును విష్ణు పొందారు. పార్టీల‌కు అతీతంగా స్నేహం చేస్తూ, త‌న వాక్చాతుర్యంతో అంద‌ర్నీ ఆక‌ట్టుకునే నేర్ప‌రిత‌నం క‌లిగిన విష్ణుతో పాటు మ‌రికొంద‌రిని తిరుప‌తి ఎన్నిక‌ల రంగంలోకి సోము వీర్రాజు దింపారు.

ఈ నేప‌థ్యంలో ముఖ్యంగా తట‌స్థులతో పాటు యువ‌త‌పై బీజేపీ దృష్టి కేంద్రీక‌రించింది. విద్యానిల‌య‌మైన తిరుప‌తిలోని ప‌లువురు ప్రొఫెస‌ర్లు, వ‌ర్సిటీ విద్యార్థులు, రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారుల‌ను విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి క‌లుస్తున్నారు. రాయ‌ల‌సీమ మేధావుల ఫోరం క‌న్వీస‌ర్ పురుషోత్త‌మ్‌రెడ్డితో పేర్లు బ‌య‌టికి ప్ర‌క‌టించ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని నాయ‌కుల‌ను ఆయ‌న క‌లిసి రాయ‌ల‌సీమ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించారు.  

సీమ స‌మ‌స్య‌ల‌ను ఎన్నిక‌ల్లో ప్ర‌స్తావించి, వాటి ప‌రిష్కారానికి హామీ ఇవ్వ‌డం ద్వారా రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారులు, రైతులు, విద్యావంతుల‌ను త‌మ వైపు తిప్పుకునే ఉద్దేశం విష్ణు చ‌ర్చ‌ల్లో ప్ర‌తిబింబిస్తోంది. అలాగే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో అసంతృప్తి నేత‌ల‌పై బీజేపీ దృష్టి సారించిన‌ట్టు తెలుస్తోంది.  జ‌న‌సేనతో పొత్తు వ‌ల్ల ఆ పార్టీ అధినేత సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఓట్ల‌ను గంప‌గుత్త‌గా పొంద‌వ‌చ్చ‌ని బీజేపీ భావిస్తోంది. అదే జ‌రిగితే టీడీపీకి కోలుకోలేని దెబ్బ‌గా చెప్పొచ్చు.

టీడీపీ అధికారంలో లేక‌పోవ‌డంతో ఆ పార్టీ నుంచి కాపు సామాజిక వ‌ర్గం క్ర‌మంగా దూరం జ‌రుగుతుంది. అయితే వాళ్లు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వైసీపీకి మ‌ద్దతు ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఇది బీజేపీకి లాభించే అవ‌కాశం ఉంది. ప్ర‌ధానంగా నోటాను అధిగ‌మించ‌డంతో పాటు క‌నీసం రెండో స్థానంలోనైనా నిల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో బీజేపీ ప్ర‌తి చిన్న అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని భావిస్తోంది.

తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలో పాటు చిత్తూరు జిల్లాలోని ప‌లువురు టీడీపీ ముఖ్య నేత‌లు కూడా బీజేపీలో చేరేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌నే భావ‌న‌లో ఉన్నార‌ని తెలిసింది. అలాంటి వారిని గుర్తించి చేర్చుకునేందుకు చ‌ర్చించే ప‌నిలో విష్ణు నిమ‌గ్న‌మ‌య్యార‌ని తెలిసింది. పార్టీలో చేరేందుకు ఎవ‌రెవ‌రు సిద్ధంగా ఉన్నారు, వారి డిమాండ్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి త‌న‌పై న‌మ్మ‌కాన్ని ఉంచిన  సోము వీర్రాజు దృష్టికి తీసుకెళుతున్న‌ట్టు స‌మాచారం.

రెండు మూడు రోజుల్లో కొంద‌రు టీడీపీ ముఖ్య నేత‌ల చేరిక‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌నే టాక్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎప్పుడు? ఎవ‌రు పార్టీ కండువా మారుస్తార‌న‌నే ఆందోళ‌న ప్ర‌ధానంగా టీడీపీలో క‌నిపిస్తోంది. 

బుద్ది లేని రాతలు