బడుగు బలహీన వర్గాల్ని నీచంగా చూసిన చరిత్ర టీడీపీది. జీతాల కోసం సమ్మెకు దిగితే తోక కత్తిరిస్తామని హెచ్చరించింది స్వయానా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు. ఎవరైనా ఎస్సీగా పుట్టాలని కోరుకుంటారా తమ్ముళ్లూ అంటూ బహిరంగంగా ప్రకటించిన చరిత్ర అతడిది. మహిళా ప్రభుత్వ ఉద్యోగిని ఎమ్మెల్యే కొడితే కనీసం ఓదార్చని ప్రభుత్వం అది. అందుకే మొన్న ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేశారు ప్రజలు. కోలుకోలేని దెబ్బ కొట్టారు.
అయితే ఇంత చేసినా ఆ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధిరాలేదు. తప్పులు తెలుసుకోవాల్సింది పోయి కక్షపూరిత రాజకీయాలకు తెరదీస్తున్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. టీడీపీ రాజకీయాలు ఎలా ఉంటాయో పుల్లారావు మాటలు స్పష్టంగా చెబుతున్నాయి.
“టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే అభివృద్ధి రెండో ప్రయారిటీ. రివెంజ్ తీర్చుకోవడమే మొదటి ప్రయారిటీ. మామీద 4 కేసులు పెడితే, అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ల మీద 10 కేసులు పెడతాం. నిద్ర కూడా పోనీయం.”
చూశారుగా.. పుల్లారావు మాటలు. ఈసారి అధికారం వస్తే పూర్తిగా పగ తీర్చుకోవడానికే కేటాయిస్తామని విస్పష్టంగా ప్రకటిస్తున్నారాయన. అంటే ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఓడిపోయినా ఇప్పటికీ ప్రజల కష్టాలు, అభివృద్ధి వీళ్లకు పట్టడం లేదు. వీళ్ల బుద్ధి మారడం లేదు. కొసమెరుపు ఏంటంటే.. అవసరమైతే కేసులు పెట్టే విషయంపై చంద్రబాబుతో కూడా వాదిస్తానని కార్యకర్తలకు మాటిస్తున్నారు సదరు పుల్లారావు.