అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు బాగుపడితే చాలా? అని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో మాజీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె వద్ద మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభా వేదిక మీద నుంచి అజయ్ కల్లం కీలకమైన ప్రశ్నలు సంధించారు.
‘రాయలసీమలో తాగునీటికి, పొట్టకూటికి జనం ఏడుస్తుంటే అమరావతిలో కొందరు రూ.కోట్లు పోయాయని ఏడుస్తున్నారు. అమరావతిలోనే రైతులున్నారా.. విశాఖ, కర్నూలు జిల్లాల్లో లేరా? అని ఆయన నిలదీశారు. టీడీపీ నేతలు, వారి బినామీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పత్రికాధిపతుల చేతుల్లో అమరావతి భూములున్నాయని ఆరోపించారు. వాళ్లే అమరావతిలో రాజధాని కొనసాగించాలని ఆందోళనలు చేస్తున్నారన్నారు.
దేశానికి మధ్యలో రాజధాని ఉండాలని తుగ్లక్ ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కు మార్చారని, ఇప్పుడు రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలంటూ, అమరావతిని మార్చకూడదనే వాళ్ల ఆలోచనలే తుగ్లక్‌ను మరిపిస్తున్నాయని అజయ్ కల్లం మండిపడ్డారు. తుగ్లక్ ఆలోచనలు వారిలో పెట్టుకుని, ప్రభుత్వానివి తుగ్లక్ ఆలోచనలని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలని ఎవరు చెప్పారు? తమిళనాడు, మహారాష్ట్ర రాజధానులు, దేశ రాజధాని ఢిల్లీ, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల రాజధానులు ఓ చివరన లేవా? అని అజయ్ కల్లం నిలదీశారు.