సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాలపై ఆసక్తితో అత్యున్నత స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటించాడు. రైతులతో ముఖాముఖి మాట్లాడాడు. ఏడాది క్రితం ఆయన పర్యటనలను చూసి సొంత పార్టీ పెడతాడేమోనని అందరూ భావించారు. లేదు లేదు…లోక్‌సత్తా పార్టీ పగ్గాలను జేడీకి జయప్రకాశ్ అప్పగిస్తాడనే ప్రచారం జరిగింది.
అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపించిన తరుణంలో హడవుడిగా ఆయన పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి జనసేన తరపున బరిలో నిలిచి గట్టి పోటీ ఇచ్చాడు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ కాన్సెప్ట్‌తో ముందుకు పోవాలని తపించాడు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ విశాఖను విడిచిపెట్టలేదు. కానీ జనసేన పార్టీతో మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చాడు. చాలా రోజులుగా ఆయన జనసేనను వీడుతాడనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఎట్టకేలకు మూడు రోజుల క్రితం జనసేనకు ఆయన రాజీనామా చేశాడు.
తన రాజీనామాపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడాడు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తానన్నాడు. ప్రజలు, రైతు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నాడు. ఇక ముందు కూడా ప్రజాసేవ చేస్తూనే ఉంటానన్నాడు. ప్రజాసేవకు అత్యుత్తమ వేదిక మాత్రం రాజకీయమే అని ఆయన స్పష్టం చేశాడు.
ఇంతకాలం తానున్న జనసేన ప్రజాసేవకు సరైన వేదిక కాదని జేడీ మాటలు చెప్పకనే చెబుతున్నాయి. నిజంగా తన లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగా జనసేన ఉండి ఉంటే దాన్నుంచి లక్ష్మినారాయణ బయటకు వచ్చేవారు కాదని ఆయన్ను బాగా ఎరిగిన వారు చెబుతున్న మాట. అంతే కాకుండా జనసేన పార్టీలో తన ప్రయాణం ముగిసిన అధ్యాయమని చెప్పడాన్ని బట్టి…జనసేనాని పవన్‌కల్యాణ్ ధోరణితో లక్ష్మినారాయణ చాలా విసిగిపోయాడనే భావన వ్యక్తమవుతోంది.
లక్ష్మినారాయణను జనసేన సరైన పద్ధతిలో ఉపయోగించుకోక పోవడం వల్లే ఆయన ఆ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని జేడీ మిత్రులు చెబుతున్నారు. కానీ కేంద్రబడ్జెట్‌ను ప్రశంసించే మాటలను బట్టి జేడీ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నాడని తెలుస్తోంది.