చిరంజీవిని వివాదాల్లోకి లాగుతున్న శైలజానాథ్‌

రాజకీయాలు తనకు సరిపడవన్న ఆలోచనతో మెగాస్టార్‌ చిరంజీవి, ఎప్పుడో రాజకీయాలకు వదిలేశారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, దాన్ని నడపలేక.. కాంగ్రెస్‌ పార్టీలో కలిపేసి, కేంద్ర మంత్రి పదవిలో కొన్నాళ్ళు కొనసాగిన చిరంజీవి, ఈ మధ్యకాలంలో…

రాజకీయాలు తనకు సరిపడవన్న ఆలోచనతో మెగాస్టార్‌ చిరంజీవి, ఎప్పుడో రాజకీయాలకు వదిలేశారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, దాన్ని నడపలేక.. కాంగ్రెస్‌ పార్టీలో కలిపేసి, కేంద్ర మంత్రి పదవిలో కొన్నాళ్ళు కొనసాగిన చిరంజీవి, ఈ మధ్యకాలంలో ఎక్కడా రాజకీయాల గురించి మాట్లాడటంలేదు. సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తూనే.. సినీ రంగంలో తన స్టామినా అలాగే వుందని నిరూపించుకున్నారాయన.

మళ్ళీ చిరంజీవి, రాజకీయాల్లోకి వచ్చే ఛాన్సే లేదని చిరంజీవి అభిమానులెప్పుడో ఫిక్సయిపోయారు. ఆయన కూడా, రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపడంలేదుగానీ.. రాజకీయ నాయకులు, పార్టీలతో సంబంధాలు మాత్రం 'స్నేహపూర్వకంగా' కొనసాగిస్తున్నారు. బీజేపీ నేతల్ని ఆ మధ్య కలిశారు.. మొన్నీమధ్యనే ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ని కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ ఆ మధ్య మంతనాలు జరిపారు.

అయితే, చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారనీ, కాంగ్రెస్‌ పార్టీలో ఆయన కీలక బాధ్యతలు తీసుకోనున్నారనీ కొత్తగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ సారధ్య బాధ్యతలు స్వీకరించిన శైలజానాథ్‌ సెలవిచ్చారు. 'చిరంజీవి రాకతో కాంగ్రెస్‌ పార్టీలో మళ్ళీ కొత్త ఉత్సాహం వస్తుంది..' అంటూ శైలజానాథ్‌ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్‌లో కలకలం రేగింది.

'ఇది నిజమేనా.?' అన్న చర్చ ఓ పక్క, చిరంజీవిని ట్రోల్‌ చేయడం ఇంకోపక్క.. వెరసి మెగా ఫ్యాన్స్‌లో చీలిక స్పష్టంగా కన్పిస్తోంది. ఆ మధ్య చిరంజీవి, ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానుల విషయమై వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ప్రకటించిన వెంటనే.. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, చిరంజీవిపై చాలా దారుణమైన కామెంట్స్‌ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ స్థాయి 'నెగెటివిటీ' సోషల్‌ మీడియాలో మెగా ఫ్యాన్స్‌ మధ్య కన్పిస్తోంది.

అయినా, వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోంది.. ఆ నిర్ణయానికి చిరంజీవి మద్దతు పలికారు. ఆ లెక్కన చిరంజీవి, కాంగ్రెస్‌ పార్టీ వైపు ఎలా చూస్తారు.? మూడు రాజధానులకు మద్దతిచ్చిన చిరంజీవిని, శైలజానాథ్‌ తమ పార్టీకి చెందిన నాయకుడని చెప్పడంలో ఆంతర్యమేంటి.? అన్నట్టు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ మనిషి.. అంటూ కొత్తగా పాత వాదనను తెరపైకి తెచ్చిన శైలజానాథ్‌.. తన ఉనికిని బాగానే చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారుగానీ.. ఇప్పటికే ఏపీలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్‌ని.. ఇంకెంత పాతాళానికి తీసుకెళ్ళిపోతారో ఏమో.!