జనసేనాని పవన్‌కల్యాణ్ ఇంత కాలం తెలంగాణలో తమకు వ్యతిరేకంగా మాట్లాడకపోవడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా స్నేహంగా మెలిగింది. కానీ ఇప్పుడు తమకు వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేయాలని పవన్ పిలుపు ఇవ్వడంతో పవన్‌పై టీఆర్ఎస్ నేతలు సెటైర్లు విసరడం స్టార్ట్ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని మూడు రోజుల క్రితం పవన్‌కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే అనూహ్యంగా నిన్న పవన్‌తో బీజేపీ నేతలైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ కలిసి చర్చించారు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో తాము పోటీ నుంచి తప్పుకున్నట్టు పవన్‌కల్యాణ్ ప్రకటించారు. అలాగే ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా బీజేపీకి వేయాలని తన పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
తమకు వ్యతిరేకంగా పవన్ పిలుపును దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఆయనపై సెటైర్లు విసిరారు. పక్క రాష్ట్రం( ఏపీ)లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి (పవన్‌కల్యాణ్) ఇక్కడ పోటీకి దిగుతాననడం హాస్యాస్పదమన్నారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయనతో లేడన్నారు.
అలాంటి పార్టీని, వ్యక్తిని బీజేపీ కలుపుకోవడం విడ్డూరంగా ఉందని అవహేళ చేశారు. పక్క రాష్ట్రంలో ఏమీ చేయలేనోడు, ఇక్కడికొచ్చి ఏం చేస్తాడని బాల్క సుమన్ ప్రశ్నించారు. విస్తృత ప్రయోజనాల కోసం పోటీ చేయట్లేదని పవన్ అన్నారని, ఈ మాటలు వింటుంటే జనాలు నవ్వుకుంటున్నారని పంచ్‌లు విసిరారు.
మొత్తానికి పవన్‌ను టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ దులిపేశారు. నిన్నటి పవన్ ప్రకటనపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.