రాజకీయాలలో హత్యలు ఉండవు..ఆత్మహత్యలే కాని అన్నది చాలా పాపులర్ నానుడి. ఇప్పుడు ఇది ప్రతిపక్ష నేత, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుకు, టిడిపికి బాగా వర్తిస్తుందని అనుకోవచ్చు. ఆయన గత కొంతకాలంగా చేస్తున్న చర్యలు కాని, ఆచరిస్తున్న పద్దతులు కాని అవన్ని ఆ వైపే చూపిస్తున్నాయి.
తెలుగుదేశంపార్టీ మునిగిపోవడానికి అవన్ని మరింత దోహదపడుతున్నట్లుగా అనిపిస్తుంది. నా అభిప్రాయం తప్పు కావచ్చు.రైటు కావచ్చు. కాని ఇందుకు సంబందించిన ప్రాతిపదికను వివరిస్తాను.
శాసనమండలిని రద్దు చేసేవరకు వెళ్లడానికి చంద్రబాబే బాద్యుడు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకించవచ్చు. తప్పు లేదు. కాని కుట్రపూరిత విదానం అనుసరించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించారు. పైగా పాలాభిషేకాలతో మరింత రెచ్చగొట్టారు. దీంతో మండలి రద్దు తీర్మానం వచ్చింది. ఇది వైసిపికి కొంత నష్టం చేస్తుంది..వాళ్లకు కూడా రావల్సిన పదవులు కొన్ని పోతే పోవచ్చు. కాని అసలే కష్టాలలో ఉన్న టిడిపికి ఇది శరాఘాతం అయింది.
కేంద్రం మండలి తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదిస్తుందన్నది చెప్పలేం కాని, టిడిపి ఎమ్మెల్సీలలో మాత్రం గుండెల్లో రాయి పడినట్లే కదా..ఒకవేళ బిజెపి కనుక టిడిపిని దెబ్బకొట్టాలని అనుకుంటే సాద్యమైనంత తొందరగా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే టిడిపి కి మిగిలిన మండలి పదవులన్నీ పోవడం ఖాయం.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో పదవులు పోయేవారికి వేరే రూపంలో పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. టిడిపికి ఆ చాన్స్ లేదు. ఈ విషయాన్ని ఆలోచించి చంద్రబాబు తగు విదంగా ప్రవర్తించి ఉండవలసింది. అలా చేయకపోగా తన సహజ శైలి లో కుట్ర పద్దతి అనుసరించి ఇప్పుడు తన పార్టీని ఆత్మహత్య సదృశ్యంగా మార్చుకున్నారు.
పదవులు పోతే ఎమ్మెల్సీలకు తాను ఆ నష్టాన్ని భరిస్తానని చెప్పవలసి వస్తోంది. ఇది మొదటి సారి కాదు. నిజానికి 2014 లో అనూహ్యంగా గెలిచినప్పటి నుంచి చంద్రబాబు ఇవే పద్దతులు అవలంబిస్తూ వచ్చారు. ఒకటి కాదు..వంద తప్పులు చేశారని చెప్పాలి. మూడోసారి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో సున్నం పెట్టుకున్నారు. ఆయనను నిత్యం ఎద్దేవ చేస్తుండేవారు. అక్కడితే ఆగలేదు. ఏకంగా కెసిఆర్ ప్రభుత్వాన్ని కూల్చే యత్నం చేసి ఆయన పుట్టలో వేలు పెట్టారు. వెంటనే కెసిఆర్ వేలును కట్ చేశారు. దాంతో దొరికిపోయిన దొంగ మాదిరి రాత్రికి రాత్రే హైదరాబాద్ వదలి విజయవాడ వెళ్లిపోవల్సి వచ్చింది.దానికి ఎంత కవరింగ్ ఇవ్వాలని అనుకున్నా, వాస్తవం ప్రజలందరికి తెలుసు.
చంద్రబాబు తన మానాన తాను పనిచేసుకుని పోయి ఉంటే ఈ వివాదాలే లేవు. అనవసరంగా వేరే రాష్ట్రం వ్యవహారాలలో తలదూర్చి రాజకీయంగా తెలంగాణ లో టిడిపి అంతం అయిపోయే పరిస్థితి తెచ్చుకున్నారు. ఆయన పార్టీకి నష్టం జరిగితే అది పరిమితమే అవుతుంది.కాని ప్రజలందరికి నష్టం చేశారు. ఉమ్మడి రాజధాని గా పదేళ్లు ఉండడానికి అవకాశం ఉన్న హైదరాబాద్ ను వదలుకున్నారు. ఇది ఆత్మహత్య సదృశ్యంగా మారింది. కేవలం రాజకీయంగా ఆయనకే అయితే పర్వాలేదు. కాని మొత్తం ఆంద్ర ప్రదేశ్ కే ఆత్మహత్యా సదృశ్యం అయింది .
చంద్రబాబు హైదరాబాద్ లో ప్రభుత్వ భవనాల రిపేర్లకు పెట్టిన కోట్ల రూపాయల ఖర్చులన్నీ వృధా అయిపోయ్యాయి. అంతేకాదు..ఎపిలో ఉన్న ఉమ్మడి ఆస్తులను దాదాపుగా వదలుకున్నారు. వాటిలో వాటా వస్తుందో,రాదో తేల్చుకోకుండానే చంద్రబాబు అప్పటి ఓటుకు నోటు కేసులో కెసిఆర్ తో రాజీపడి.తనపైకి కేసు రాకుండా ఉంటే చాలని ఎపి ప్రజల హక్కులను ధారాదత్తం చేశారు. ఇది చంద్రబాబుకు, టిడిపికి రాజకీయంగా ఆహ్మహత్యగా పరిణమించింది. కాకపోతే అప్పట్లో వెంటనే సాదారణ ఎన్నికలు లేవు కాబట్టి దానిపై ప్రజలు నేరుగా తమ అబిప్రాయం చెప్పలేకపోయారు.
ఆ తర్వాత రాజదాని పేరుతో సాగించిన ప్రహసనం మరో పెద్ద ఆత్మహత్య సదృశ్యం. అప్పట్లో ఎంతమంది ముప్పైవేల ఎకరాలు తీసుకోవడం ఎందుకు అన్నా, ప్రభుత్వ భూమిని వాడుకుంటే సరిపోతుందని చెప్పినా వినిపించుకోలేదు. పైగా మూడు పంటలు పండే భూములను రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చారు. ఇది కూడా రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమే అయింది. మొత్తం అన్ని జిల్లాల ప్రజలకు దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. గుంటూరు,కృష్ణా జిల్లాల ప్రజలకు ఒక కారణం అయితే, మిగిలిన జిల్లాల వారికి మరో కారణం కావచ్చు. తద్వారా చంద్రబాబును రాజదానే ఓడించిందంటే ఆశ్చర్యం కాదు.
ఇక పిరాయింపులు అనైతికం అని తెలిసినా, అంతకు ముందు తానే తెలంగాణలో పిరాయింపులను తీవ్రంగా విమర్శించినా, స్వయంగా ఆయనే వైసిపి ఎమ్మెల్యేలు 23 మందిని కోట్లు పెట్టి కొనుగోలు చేయడం రాజకీయంగా పెద్ద ఆత్మహత్యగా మారింది. ఆ విషయం తెలుసుకోవడానికి ఆయనకు చాలా కాలం పట్టింది. అమరావతి రాజధానిలో తాత్కాలిక భవనాల పేరుతో వేల కోట్లు వృదా చేశారు. పర్యావరణ నిబందనలు ఒప్పుకోవని తెలిసినా, కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ నివాసంలో ఆయన బస చేయడం మరో పెద్ద తప్పు.
ప్రజలకు నైతిక విలువలు గురించి చెప్పవలసిన ముఖ్యమంత్రే ఇలా అడ్డగోలుగా అక్రమ కట్టడాలలో ఉంటున్నారని ప్రజలు భావించారు. అయినా రాజదానిలో ఏమైనా ప్రగతి సాదించి ఉంటే జనం ఏమైనా నమ్మేవారేమో. కాని అదంతా గ్రాఫిక్స్ కే పరిమితం అవడమో, లేక తనకు మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియాలకు పరిమితం అవడమో జరిగింది. దీనిని ప్రజలు అర్ధం చేసుకుని టిడిపిని ఘోరంగా ఓడిచారు. ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబు అచ్చంగా ఈనాడు, జ్యోతిలను నమ్ముకుని పూర్తిగా మునిగిపోయారు. ఆ తర్వాతకూడా చంద్రబాబులో ఏమైనా మార్పు వచ్చిందా అంటే అలా లేకపోగా,ఇంకా అనేక ఆత్మహత్య సదృశ్యమైన నిర్ణయాలు చేసుకుంటూ పార్టీని గందరగోళంలోకి నెట్టారు.
రాజధానిపై వైసిపి ప్రభుత్వం ఏమి చేయడం లేదంటూ నిత్యం ప్రచారం చేయడం, తన కు మద్దతు ఇచ్చే టీవీలను వెంటబెట్టుకుని వెళ్లి అమరావతిని చంపేస్తున్నారు..నేనైతే అలా అయ్యేది..ఇలా అయ్యేది అంటూ మళ్లీ భ్రమలలోకి వెళ్లారు.ఈ పరిస్థితిని అర్దం చేసుకున్న ప్రభుత్వం అమరావతి లో ఎంత ఖర్చు పెట్టినా అది పెద్ద సొరంగంలో పోసినట్లే తప్ప, ఇప్పటికిప్పుడు తేలేది కాదని అర్దం చేసుకునేలా చంద్రబాబు చర్యలు ఉపయోగపడ్డాయంటే ఆశ్చర్యం కాదు. నాలుగైదు లక్షల కోట్లు రాజదానికి కావాలని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడు మూడువేల కోట్లు చాలని ఒకసారి, ఆ తర్వాత ఒక్క పైసా కూడా అక్కర్లేదని మరో సారి చెప్పడం ఆత్మహత్య సదృశ్యమే అయింది. చంద్రబాబు చెప్పేది ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితిని ఆయనే తెచ్చుకున్నారు.
పైగా సెల్ఫ్ పైనాన్సింగ్ ప్రాజెక్టు అని చెప్పి కొత్త వాదన తెచ్చారు. ఇలా ఒకటి కాదు..మరి ఈ పని ఆయన అధికారంలో ఉన్నన్నాళ్లు ఎందుకు చేయలేదన్నదానికి ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయారు. పైగా లక్షల కోట్లు కావాలని ఎందుకు అన్నారో చెప్పలేదు. ఇదంతా రాజకీయంగా ఆయనకు ఆత్మహత్య సదృశ్యమే.
అంతేకాదు..ఎపికి ఒక మహానగరం కావాలంటూ, తాను అమరావతి అనే గొప్ప నగరాన్ని సృష్ఠిస్తున్నానని ప్రచారం చేసుకున్నారు. ఇదేమిటి ఈ మహానగరం గోలేమిటా అని ప్రజలంతా ఆశ్చర్యపడవలసి వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రెండు లక్షల కోట్లు పెట్టి కొత్త నగరం ఎలా నిర్మిస్తాం..విశాఖను వాడుకుందాం అనగానే చంద్రబాబు తన పార్టీ కూసాలన్ని విరిగిపోయినట్లు పీల్ అవుతున్నారు. తన కు సంబందించినవారి రియల్ ఎస్టేట్ ఆర్దిక మూలాలన్ని దెబ్బతింటున్నాయని కంగారుపడుతున్నారు. ఇలాంటి ఐడియా ఇచ్చి జగన్ విశాఖకు వెళ్లేలా పురికొల్పింది చంద్రబాబే అని అనుకున్నా చిత్రమేమీ కాదు.
ఆ తర్వాత రాజదాని ఇక్కడ నుంచి వెళ్లిపోతోందంటూ గగ్గోలు పెడుతూ తాను గుర్తించిన రాజదాని గ్రామాలో ఆందోళనకు రెచ్చగొట్టి మరో తప్పు చేశారు. ఇది రాజకీయంగా టిడిపికి మరింత వినాశనం అయింది. ఆయన జగన్ నిర్ణయానికి మద్దతు ఇవ్వకపోయినా, వ్యూహాత్మకంగా ఈ ప్రాంతాన్ని, ఈ భూములను ఏమి చేస్తారని ప్రశ్నించి ఉంటే మొత్తం బాద్యత జగన్ పై పడింది. కాని జగన్ బాద్యత కూడా తనదే అన్నట్లుగా చంద్రబాబు రోజూ రాజదాని గ్రామాలలో ఆందోళన చేయడం, ఒక గ్రామ నాయకుడి మాదిరి, రోజూ అక్కడకు వెళ్లి కూర్చోవడంతో చివరికి జాతీయ పార్టీ అద్యక్షుడిని అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఆ ముప్పై గ్రామాలకు పరిమితం అవ్వవలసి వచ్చింది. ఇది కూడా ఆత్మహత్య సదృశ్యమే కదా.
వికేంద్రీకరణ బిల్లుపై కూడా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయారు. అటు విశాఖలో, ఇటు రాయలసీమలో టిడిపి ఎప్పటికీ కోలుకోలేని రీతిలో ప్రవర్తించారు. పోని పక్కన గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఏమైనా ఉపయోగం జరిగిందా అంటే ఆ గ్రామాలు దాటి వేరే చోట అసలు ఆందోళనలే కనిపించలేదు. దీంతో ఇదంతా చంద్రబాబుకు మరింత నష్టం చేసేదిగా మారింది. ఆ విషయం అసలు అర్దం కాకుండ ఉంటుందా అంటే నమ్మలేం. కాని ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారంటే ,రాజకీయ బంధం కన్నా ఆర్దిక బందమే ఆయనను ఎక్కువగా కలవరపరుస్తోందని అనుకోవాలి. అందువల్లే ఆయన రాజధాని గ్రామాల చుట్టూరానే పరిభ్రమించే పరిస్థితిలో పడ్డారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి చేసినా ఎదురులేనట్లుగా సాగింది. కాని పరిస్థితులు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం. అందుకే రాజకీయాలలో ఆత్మహత్యలే ఉంటాయని అంటారు.
కొమ్మినేని శ్రీనివాసరావు