ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు అసలు ఉద్యోగం కంటే కొసరు ఉద్యోగమే చేతి నిండా పని కల్పించినట్టుంది. ప్రతి చిన్న విషయానికి ఫిర్యాదులు చేయడం అనవాయితీ అయింది.
ఎన్నికల పనికంటే ఇతర పనులే ఆయనకు ఎక్కువైనట్టు కనిపిస్తోంది. గత మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేయడం, దానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అప్పట్లో జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఏకంగా కేంద్రహోంశాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అది మొదలు ఆ తర్వాత కాలంలో ఫిర్యాదులే ఫిర్యాదులన్నట్టు తయారైంది.
తనకు ఆంధ్రప్రదేశ్‌లో రక్షణ లేదని, హైదరాబాద్‌లో ఉంటూ విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. న్యాయస్థానం ఆదేశాలతో తిరిగి ఆయన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించారు.
తనకు ప్రభుత్వం నుంచి సహకారం కొరవడిందని ఆయన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల గురించి నిమ్మగడ్డ ప్రకటించారు. దీనిపై రాష్ట్రమంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో స్పందించారు.
పదవి నుంచి దిగిపోయే లోపు చంద్రబాబుకు ఏదో రకంగా లబ్ధి చేకూర్చేందుకు నిమ్మగడ్డ తహతహలాడుతున్నారని విమర్శించారు. అలాగే రిటైర్డ్ తర్వాత టీడీపీలో చేరి ఎన్నికల్లో నిలిస్తే అప్పుడు ఎవరేంటో చూసుకుందామని కొడాలి నాని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కొడాలి నానిపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తాజాగా ఫిర్యాదు చేశారు.
అసభ్యపదజాలమే కాకుండా ఎన్నికల నిర్వహణపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని నానిపై ఫిర్యాదు చేశారు. అలాగే ఉద్యోగులను ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా కొడాలి నాని రెచ్చగొట్టేలా మాట్లాడారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌ను ఉద్దేశించి నాని చేసిన వ్యాఖ్యలు, పత్రికల్లో వచ్చిన క్లిప్లింగులు, వీడియోలను గవర్నర్‌కు లేఖతోపాటు పంపారు. వెంటనే మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇలా ప్రతి అంశంపై ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు నిమ్మగడ్డ ఫిర్యాదు చేస్తూ పోతే …చివరికి ఏమవుతుంది? ఇదంతా మామూలే అని అనుకునే పరిస్థితి వస్తుంది. నానిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయగానే, ఆయనేమన్నా మంత్రిని కొడతారా? .
నిమ్మగడ్డ ఫిర్యాదుల వ్యవహారం చూస్తుంటే ,బాల్యంలో పిల్లల మధ్య చోటు చేసుకునే గొడవలు, వాళ్లు తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయడం గుర్తు చేస్తోంది.
హూందాగా నడుచుకోవడం వల్లే ఇలాంటివి తలెత్తకుండా అరికట్టొచ్చు. అంతే తప్ప, భయంతో అదుపు చేయాలనుకుంటే మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు.