‘నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది’ – పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో ఓ డైలాగ్. సినిమాలో ఆయన పాత్రకే కాదు రియల్ లైఫ్‌లో కూడా అలాంటి లెక్క ఏమైనా ఉందా? అమరావతి రాజధాని రైతులపై జనసేనాని పవన్‌కల్యాణ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో గబ్బర్‌సింగ్ సినిమా డైలాగ్ తెరపైకి వచ్చింది.
నవ్వడం ఓ భోగం, నవ్వించడం ఓ యోగం, నవ్వకపోవడం రోగం అని సినీ దర్శకుడు జంధ్యాల ఏనాడో చెప్పారు. జంధ్యాల సినిమా అంటే చాలు తెగ ఆసక్తి చూపేవాళ్లు. ఎందుకంటే ఆయన సినిమాలు ఆరోగ్యకరమైన కామెడీకి ప్రతీక. నిజానికి కామెడీ సినిమాలు తీయడం అన్నింటి కంటే కష్టమైన పని. నవ్వు పండించడం అంటే నవ్వులాట కాదు.
ఎంతో హాస్యచతురత ఉంటే తప్ప కామెడీ సినిమాలు తీయడం సాధ్యం కాదు. అలాంటిది అందర్నీ పొట్ట చెక్కలయ్యేలా జనసేనాని పవన్‌కల్యాణ్ నవ్వించారు. మంగళగిరిలో జనసేన క్రియాశీల కార్యకర్తలతో రెండోరోజు బుధవారం పవన్‌కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను అమరావతి పరిరక్షణ సమితి నేతలతో కలిశారు. పవన్ వారితో అన్న మాటలు బహుశా ఈ ఏడాది అతిపెద్ద జోక్‌గా రికార్డుకెక్కే అవకాశాలున్నాయి.
“వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అని మాత్రమే చెబుతోంది. రాజధాని అమరావతి ఇక్కడ ఉండదని ఆన్ రికార్డ్‌గా చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి అలాంటి ప్రకటన వస్తే చూద్దాం. ఒకవేళ రాజధాని అమరావతి ఇక ఇక్కడ ఉండదని అంటే రాత మూలకంగా చెబితే మా కార్యాచరణ ప్రకటిస్తాం” అని తనను కలిసిన అమరావతి పరిరక్షణ సమితి నేతలతో జనసేనాని పవన్‌కల్యాణ్ అన్నారు.
బీజేపీ మిత్రపక్షమైన జనసేన నుంచి భరోసా లభిస్తుందని ఆశించిన అమరావతి పరిరక్షణ సమితి నేతలకు పవన్ మాటలు ఆశ్చర్యం కలిగించాయి. అసలు ఆయనేం మాట్లాడుతున్నారో వాళ్లకు అర్థం కాక, జుత్తు పీక్కోవడం ఒక్కటే తక్కువ. జగన్ సర్కార్ ఏకంగా అసెంబ్లీలో మూడు రాజధానుల విషయమై చట్టమే చేసింది. మరి పవన్ కల్యాణ్ ఏ ఉద్దేశంతో ఆ మాటలన్నారో అమరావతి పరిరక్షణ రైతులకు బోధ పడలేదు.
బీజేపీ డైరెక్షన్లో పవన్ పొంతన లేని మాటలు మాట్లాడారా? అనే అనుమానాలు తలెత్తాయి. ఒకవైపు న్యాయస్థానంలో మూడు రాజధానుల వ్యవహారంపై విచారణ సాగుతోంది. మరోవైపు తన పార్టీ తరపు కూడా అమరావతిలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని కొనసాగాలని జనసేన అఫిడవిట్ కూడా దాఖలు చేసింది.
బహుశా పవన్ దృష్టిలో శాసన రాజధాని కూడా అమరావతిలో ఉండదని జగన్ సర్కార్ నుంచి ప్రకటన వస్తే … కార్యాచరణ ప్రకటిస్తాననే అర్థంలో మాట్లాడారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా రాజధానిగా అమరావతే ఉంటుందని బీజేపీ తనకు స్పష్టం చేసిందని వారితో పవన్ అన్నారు. ఇంతకూ పవన్ మాటల లెక్కేంటో అమరావతి పరిరక్షణ సమితి నేతలకు అర్థమయ్యే ఉంటుందా?