జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్న పార్టీలను గుప్కార్ గ్యాంగ్ అంటూ.. అపవిత్ర కూటమి అంటూ అభివర్ణించిన కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ భలే కౌంటర్ ఇచ్చారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై స్పందించిన కపిల్, తాజాగా బీజేపీ నేత మాటలపై స్పందించారు.
కశ్మీర్ లో పీడీపీ, అబ్దుల్లాల పార్టీ.. చేతులు కలిపాయి. ఇన్నాళ్లూ తమలో తాము పోరాడిన ఈ పార్టీలు.. ఆర్టికల్ 370 రద్దు ను మాత్రం జాయింటుగా వ్యతిరేకిస్తున్నాయి. కశ్మీర్ లో ఏవైనా ఎన్నికలు జరిగితే వాటిల్లో కూడా ఈ పార్టీలు జాయింటుగా పోటీ చేసేలా ఉన్నాయి. వీటికి కాంగ్రెస్ కూడా తోడయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో.. అమిత్ షా స్పందిస్తూ వాటిని అపవిత్ర కూటమి గా అభివర్ణించారు.
ఆయన మాటలపై స్పందిస్తూ కపిల్ సిబల్ కొన్నేళ్ల కిందటి రాజకీయ పరిణామాన్ని గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్ లో ఐదారేళ్ల కిందట పీడీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైనాన్ని కపిల్ గుర్తు చేశారు. మెహబూబా ముఫ్తీని ముఖ్యమంత్రిగా చేసింది బీజేపీ వాళ్లే! ఆమెను ముఖ్యమంత్రిగా చేస్తూ.. అక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. మోడీ మొదటి సారి ప్రధాని అయిన తర్వాతే అది జరిగింది.
అప్పుడేమో పీడీపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మీరు, ఇప్పుడు పీడీపీ ఉన్న కూటమిని అపవిత్ర కూటమిగా అభివర్ణిస్తున్నారా? అని కపిల్ ప్రశ్నించారు.
ఆర్టికల్ 370 విషయానికి వస్తే.. బీజేపీ-పీడీపీలు చేతులు కలిపినప్పుడు కూడా ఆ ఆర్టికల్ కు పీడీపీ కట్టుబడే ఉంది. అప్పుడేమో పీడీపీతో చేతులు కలిపిన బీజేపీ ఇప్పుడు మాత్రం ఆ పార్టీని అపవిత్రం అంటోంది! అంటే పవిత్రం.. అపవిత్రం.. బీజేపీ అవసరాలను బట్టి మారిపోతాయేమో!