అమరావతి ఉద్యమానికి మరోసారి సంఘీభావం ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఒకవైపు ఆ మూడు గ్రామాల్లో కూడా టెంట్లు ఖాళీ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అమరావతి వాసులతో నిర్వహించిన సమావేశంలో వారు చేసిన ఉద్యమం తనను కలిచి వేసిందని చాలా బాధగా స్పందించేశారు! అమరావతి మాత్రమే ఏపీకి రాజధానిగా ఉండాలంటూ వృద్ధులు, పిల్లలు, మహిళలు రోడ్లకు ఎక్కడం తనకు చాలా బాధను కలిగించిందని పవన్ కల్యాణ్ వారికి చెప్పారు.
అమరావతి ఉద్యమ కారులకు తన పూర్తి మద్దతు ఉందని, వారి కోసం తన పోరాటం కొనసాగుతుందని పవన్ కల్యాణ్ వారికి హామీ ఇచ్చారట.
అమరావతి విషయంలో గత ప్రభుత్వ విధానాలనే కొనసాగించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అమరావతికి మద్దతు పలికితే ఏపీలోని ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకత వస్తుందని తనకు భయం లేదని పవన్ కల్యాణ్ అమరావతి వాసులకు చెప్పారు. ఇలా తన మద్దతు పూర్తిగా అమరావతికే అని పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు.
అయితే ప్రాంతానికో మాట మాట్లాడటం పవన్ కల్యాణ్ కు కొత్త కాదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినందుకు కొన్ని రోజుల పాటు అన్నం మానేసినట్టుగా ఒకసారి ప్రకటించిన పవన్ కల్యాణ్, అంతకు ముందు ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన ఘనత బీజేపీదే అని కూడా ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమాన్ని మెచ్చుకున్నారు. తనకు మరుజన్మ ఉంటే తెలంగాణలో పుట్టాలని ఉందని కూడా ప్రకటించారు. అవన్నీ మాట్లాడుతూనే.. మరోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరినప్పుడు తను 11 రోజుల పాటు అన్నం తినకుండా మానేసినట్టుగా ప్రకటించిన ఘనత పవన్ కల్యాణ్ దే.
ఇక ఏపీ రాజధాని అంశం గురించి కూడా ఊరికో మాట మాట్లాడాడు పవన్ కల్యాణ్. కర్నూలు వెళ్లి తన దృష్టిలో అదే రాజధాని అన్నాడు. అమరావతి ఒక కుల రాజధానిగా మారిపోయిందని కూడా ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇప్పుడు మాత్రం అమరావతికే తన మద్దతు అని ప్రకటించాడు. మరి రేపు స్థానిక ఎన్నికల్లో ప్రచారానికి ఏ కర్నూలుకో, తిరుపతికో..విశాఖపట్నమో వెళ్లినప్పుడు పవన్ కల్యాణ్ ఏం చెబుతాడో! అయినా పవన్ ఏ ఉద్యమానికి మద్దతు ఇచ్చి ఏం ప్రయోజనం ఉంటుందిలే!