యస్-బ్యాంకు సంక్షోభం జనాలు మరిచిపోకముందే.. మరో బ్యాంకు మారటోరియం పరిస్థితులను ఎదుర్కొంటూ వార్తల్లోకి ఎక్కింది. ఈసారి వంతు లక్ష్మీ విలాస్ బ్యాంకు. ఈ బ్యాంకు ఖాతాదారులు పాతిక వేల రూపాయలకు మించి విత్ డ్రా చేయలేని స్థితిని విధించింది ఆర్బీఐ. ఈ బ్యాంక్ పరిస్థితి దిగజారుతున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.
దేశంలో బ్యాంకుల పరిస్థితులు ఇలా తగలడుతున్నాయి. ఈ విషయంలో మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తమకు అధికారం ఇస్తే విదేశీ బ్యాంకుల్లో దాగున్న నల్లధనాలను తీసుకొస్తామని చెప్పిన బీజేపీ వాళ్లు.. దేశీయంగా బ్యాంకులు దివాళాలు తీస్తున్న నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు సాగుతున్నాయి.
ఏదైనా పాజిటివ్ గా పనికొస్తుందంటే.. అదంతా మోడీ ఘనతే అని, మోడీ అనుసరిస్తున్న విధానాల ఫలితమే అని మోడీ భక్తగణం గప్పాలు కొడుతూ ఉంటారు. అయితే ఏకంగా బ్యాంకులే ఒకదాని తర్వాత మరోటి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా.. ఈ విషయంలో బాధ్యత ఏమీ లేదన్నట్టుగా సాగుతూ ఉంది వ్యవహారం!
యస్-బ్యాంకు, ఇప్పుడు లక్ష్మి విలాస్.. పేరున్న బ్యాంకులే ఒకదాని తర్వాత మరోటి ఇలా ఖాతాదారులకు షాకులిస్తుంటే.. బ్యాంకులను ప్రజలు నమ్మే పరిస్థితులే తగ్గిపోయేలా ఉన్నాయి. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఇవి.