ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ద్వేషం చివరికి సంప్రదాయాల్ని కూడా వ్యతిరేకించే స్థాయికి కొందర్ని దిగజార్చింది. జగన్‌పై అక్కసు …విశాఖ శారదా పీఠాన్ని టార్గెట్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి ఈ వ్యవహారం న్యాయస్థానం మెట్లు ఎక్కింది. దీంతో మరోసారి ఆ విషయమై చర్చకు దారి తీసింది.
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినం రోజు ఆలయ మర్యాదల విషయంలో దేవాదాయశాఖ అద నపు కమిషనర్ రామచంద్రమోహన్ ఈ నెల 12న జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ సోమవారం హైకోర్టులో పిల్ దాఖలైంది.
తెలంగాణకు చెందిన కాకుమాను లలిత్‌కుమార్, ఏపీకి చెందిన మరో ఇద్దరు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోడానికి వీల్లేదని పిల్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై నేడు విచారణ జరగనుంది. అసలేం జరిగిందో ఒకసారి చర్చించుకుందాం.
ఈ నెల 18న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్దేశిత ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేయడం రాజకీయ వివాదానికి దారి తీసింది.
కమిషనర్ మెమోలు పంపిన వాటిలో శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యదేవా లయం, ద్వారకా తిరుమల, రామతీర్థం, సింహాచలం, కనక మహాలక్ష్మి, అన్నవరం, అంతర్వేది, మావుళ్లమ్మ దేవస్థానం ఉన్నాయి.
ఈ నెల 18న ఆయా ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు అలంకరించి, విసర్జించిన మాలలను వేద పండితులు … శారదా పీఠానికి తీసుకెళ్లి స్వరూపానందేంద్రకు అందజేసి ఆశీర్వదించాల్సి ఉంటుంది. ఒక్క స్వరూపానందేంద్రస్వామి వారనే కాకుండా దేవాదాయ చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం ఇలా పీఠాధిపతుల జన్మదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే స్వరూపానందేంద్రస్వామి వారి జన్మదిన వేడుకనే ఎందుకు వివాదం చేస్తున్నారనే ప్రశ్న సహజంగానే వస్తుంది. దీనికి ఆ స్వామి వారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్నిహితంగా మెలగడమే అసలు కారణమని చెప్పొచ్చు.
రెండు రోజుల క్రితం ప్రభుత్వ ఉత్తర్వులను తప్పు పడుతూ ఓ ఎల్లో చానల్ డిబేట్ పెట్టింది. డిబేట్ సాగుతుండగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రస్వామి లైవ్‌లోకి వెళ్లి గట్టిగా జవాబిచ్చారు. అంత వరకూ ఒన్‌మ్యాన్ షోగా సాగుతున్న డిబేట్ … స్వాత్మానందేంద్రస్వామి రంగ ప్రవేశంతో ఒక్కసారిగా సీన్ మారింది.
డిబేట్లో చర్చకు వస్తున్న అంశాలు తనను బాధ పెట్టాయని ఆయన అన్నారు. అయితే ఈ సంప్రదాయం అనేది దేవాదాయశాఖ చట్టంలో ఉందన్నారు. ఇది జగన్ ప్రభుత్వమో లేక వైఎస్సార్ తీసుకొచ్చిన చట్టమో కాదన్నారు.
ఇప్పుడు జరుగుతున్నది కొత్త పోకడలు, కొత్త ఆచారాలు ఎంత మాత్రం కాదన్నారు. అనాదిగా జరుగుతున్న సంప్రదాయమే ఇప్పుడు కూడా కొనసాగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆలయాల్లో పూజలు చేయాలని తాము చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు. సహజంగా స్వామి వారి ప్రతి పుట్టిన రోజుకు ఇలా ప్రభుత్వానికి రిక్వెస్ట్ లెటర్ పెడతామని … ఈ సారి కూడా అట్లే పెట్టామన్నారు.
స్వాత్మానందేంద్రస్వామి లైవ్‌లోకి వచ్చి చెప్పక పోతే వాస్తవాలేంటో జనానికి తెలిసేది కాదు. ఎల్లో మీడియా చెప్పిందే నిజమని నమ్మే ప్రమాదం ఉండేది. కానీ జగన్ పాలనలో ప్రతిదీ ఇష్యూ చేయాలనే కుట్ర పూరిత ఆలోచనతో అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలనే తపన కొందరిలో కనిపిస్తోంది.
ఇదే స్వరూపానందేంద్రస్వామి లేఖను ప్రభుత్వం పక్కన పెట్టి ఉంటే ….ఆలయాల్లో పూజలు చేయించాలని చట్టంలో ఉన్నా, జగన్ ప్రభుత్వం ఆ సంప్రదాయాలను పాటించకుండా హిందుత్వంపై దాడి చేస్తోందని కొత్త రాగం ఎత్తుకునే వాళ్లు కాదా? గతంలో ఎప్పుడూ లేంది, ఇప్పుడు మాత్రమే స్వామి జన్మదిన వేడుకలను వివాదాస్పదం చేయడం వెనుక అదృశ్య శక్తులు లేవంటే నమ్మేదెలా? .
ఒకవేళ శారదా పీఠం రిక్వెస్ట్‌ను ప్రభుత్వం పక్కన పెట్టి ఉంటే… అప్పుడు హిందూ సంప్రదాయాలను ఈ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోందని కూడా ఇదే వ్యక్తులు కోర్టును ఆశ్రయించే వారంటే అతిశయోక్తి కాదు.