ఎవరి నోటైతే పడకూడదని ప్రత్యర్థులు కోరుకుంటారో వారి బారిన పడితే పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. ఇంకేముంది …చితక్కొట్టుడే కదా! మంత్రి కొడాలి నానికి చిక్కిన ప్రత్యర్థుల పరిస్థితి కూడా అదే. మంత్రి కొడాలి నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, ఎల్లో మీడియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియాతో కుమ్మక్కై సొంత డబ్బా కొట్టుకున్నారని మండిపడ్డారు బోగస్ న్యూస్ చానల్ (ఎబీఎన్)లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. (ఎల్లో మీడియాతో పాటు ఇది ఏబీఎన్‌కు నాని పెట్టిన అదనపు పేరు) వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు మంత్రి పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు చేసినట్టు తమ పార్టీలో వెన్నుపోటు రాజకీయాలకు తావు లేదని ఆయన తేల్చి చెప్పారు.బోగస్ న్యూస్ చానల్ ప్రచారంతో ఎంత ప్రయత్నించినా సీఎం జగన్‌ను ఏం చేయలేరన్నారు. వెన్నుపోటు పొడిచే సంస్కృతి తమకు లేదన్నారు.
వెన్నుపోటుతో మామను చంపి అధికారాన్ని హస్తగతం చేసుకున్న చంద్రబాబుకు ఆందరూ తనలాగే ఉంటారని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసన్నారు.
సిగ్గుశరం లేని చంద్రబాబుకు రామోజీ రావు, రాధాకృష్ణ డైరెక్షన్ ఇచ్చి నడిపిస్తారని మండిపడ్డారు. రామోజీ రావు, రాధాకృష్ణ, బిఅర్ నాయుడు, చంద్రబాబు ఎంత మంది కుట్ర దారులు వచ్చినా వైఎస్ జగన్‌ను ఏం చేయలేరని తేల్చి చెప్పారు.
చంద్రబాబు పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎల్లో మీడియా పెద్దలు కోట్లాది రూపాయల ప్రజాసొమ్ము కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం చచ్చే ముందైనా ఆ దుష్ట చతుష్టయం చిల్లర పనులు మానుకోవాలని కొడాలి నాని హితవు పలికారు.
కొడాలి నాని విమర్శల తీరు ధాటిగా ఉంటుంది. నేరుగా అటాక్ చేయడం ఆయన నైజం. ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్‌లంటే నాని ఒంటికాలిపై వెళ్లడం అనేకసార్లు చూశాం. తాజాగా మరోమారు తండ్రీకొడుకులతో పాటు ఎల్లో మీడియా యజమానులపై కూడా ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గత కొంత కాలంగా ఎల్లో మీడియాలో ఓ పథకం ప్రకారం జగన్‌ను మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో దించేస్తారంటూ ప్రచారం స్టార్ట్ చేశారు. ఆ దుష్ప్రచారం తిక్క కుదిర్చేందుకు నాని తనదైన శైలిలో విమర్శలకు పదును పెట్టాల్సి వచ్చింది.