ఒక మంచి విజయాన్ని ఆస్వాదించాలి అంటే మంచి వాతావరణం వుండాలి. సరిలేరు నీకెవ్వరు అనే సినిమా హిట్. అందులో సందేహం లేదు. ఓ సినిమా నైజాం లాంటి ఏరియాలో దగ్గర దగ్గర ముఫై కోట్లు వసూలు చేసింది అంటే అది బ్లాక్ బస్టర్ కిందే లెక్క. అలాగే మిగిలిన ఏరియాలు అన్నింటిలో మంచి వసూళ్లు వచ్చాయి. బయ్యర్లు అంతా హ్యాపీ అంటే బ్లాక్ బస్టర్ కిందే లెక్క.
అక్కడితో ఆగిపోతే ఏ సమస్యా లేదు. లేదా మహేష్ సినిమా ఒక్కటే విడుదలయి వున్నా ఏ తలనొప్పీ లేదు. కానీ విషయం అలా లేదు. పోటీగా బన్నీ సినిమా వచ్చింది. అలా వచ్చి ఊరుకుందా? లేదు. మహేష్ సినిమా కన్నా ఎక్కువ కలెక్షన్లు సాధించింది. అది బాక్సాఫీస్ దగ్గర క్లియర్ గా కనిపిస్తోంది.
పోనీ మన కలెక్షన్లు మనవి, వాళ్ల కలెక్షన్లు వాళ్లవి అని వదిలేస్తే ఏ గొడవా లేదు. అదీ బ్లాక్ బస్టరే..మనదీ బ్లాక్ బస్టరే అనేసుకుంటే సూపరు. లేదు. మాదే బ్లాక్ బస్టర్ గా బాప్ అనుకుంటేనే సమస్య వస్తుంది.
బాహబలి 2, బాహుబలి వన్ అనే రెండు భయంకరమైన రికార్డులు మన బాక్సాఫీస్ దగ్గర వున్నాయి. వీటిని దాటడం అనేది ఇప్పట్లో సాధ్యం అయ్యే ఫీట్ కాదు. వచ్చే ఏడాది కో, ఆ తరువాతకో టికెట్ రేటు అయిదు వందలు యూనిఫారమ్ గానో వెయ్యి రూపాయలు యూనిఫారమ్ గానో పెట్టేస్తే తప్ప. కానీ అప్పటికి ఆర్ఆర్ఆర్ వచ్చి, ఈ కొత్త రేట్లతో కొత్త రికార్డు ఎలాగూ నెలకొల్పుతుందేమో? పైగా అప్పట్లో జీఎస్టీ కలవడం అనే వ్యవహారం లేదు. అది దాదాపు 12శాతం. అంటే చిన్న విషయం కాదు.
ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని విధంగా రేట్లు పెంచారు. దాదాపు అవే రేట్లు రెండు వారాలు కొనసాగాయి. అందువల్ల రెండు సినిమాలకు భయంకరమైన ఫిగర్లు కనిపించాయి. లేదూ అంటే రెండు సినిమాలు కలిసి, రెండు రాష్ట్ర్లాల్లో దాదాపు నాలుగు వందల కోట్లు వసూళ్లు సాగించడం అంటే ఏమనుకోవాలి.
బాహబలి వన్ అనేది అప్పట్లో, అప్పటి రేట్ల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 110 నుంచి 112 కోట్ల మధ్యలో వసూళ్లు సాగించింది. బాహుబలి 2 సంగతి చెప్పనక్కరే లేదు. అది దగ్గర దగ్గర 200 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు బాహుబలి వన్ ను దాటాయా లేదా? ఈ రెండు సినిమాలు అన్నది పాయింట్.
బాహుబలి వన్ ను దాటాము అని సరిలేరు టీమ్ అంటోంది. కానీ బాహుబలి వన్ అనే సినిమా నైజాంలో దాదాపు 40 కోట్లకు పైగా, సీడెడ్ లో 20 కోట్లకు పైగా, నెల్లూరులో నాలుగు కోట్లకు పైగా వసూలు చేసింది. సరిలేరు ఈ రికార్డులకు ఇంకా దూరంగానే వుంది అన్నది ట్రేడ్ వర్గాల బోగట్టా. అల వైకుంఠపురములో మాత్రం జిఎస్ టీ తో కలిపితే కాస్త దాటే అవకాశం కనిపిస్తోంది. అలా కాకుండా ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు వరకు చూసుకుంటే బాహుబలివన్ విషయంలో సరిలేరు దాటింది అనిపించుకోవచ్చు. కానీ నైజాం, సీడెడ్, నెల్లూరు విషయాలకు వస్తే అనుమానం.
ఇలాంటి నేపథ్యంలో ఆయా జిల్లాల్లో బాహుబలి వన్ ను దాటాం. ఈ జిల్లాల్లో దాటేందుకు అవకాశం వుంది. ఇలా వివరంగా రికార్డులు అనౌన్స్ చేసి వుంటే సరిపోయింది. పోటీగా సినిమా వున్న టైమ్ లో కామెంట్లు వచ్చే అవకాశం వుండేది కాదు. కానీ అలా చేయకపోవడం వల్ల కచ్చితంగా ఫేక్ అనే గొడవ స్టార్ట్ అవుతోంది.
అల వైకుంఠపురములో సినిమా యూనిట్ తెలిసో, తెలియకో నాన్ బిబి రికార్డు అని ఊరుకుంది. వన్ ను దాటినట్లు ప్రకటించలేదు. అందువల్ల ఇక దానిపై కామెంట్ చేసే అవకాశం ఇవ్వలేదు. కానీ సక్సెస్ మీట్ లో అరవింద్ ఓ మాట అన్నారు. కొన్ని సెంటర్లలో బాహుబలి వన్ ను క్రాస్ చేసిన మాట వాస్తవం అని చెప్పారు. అది కూడా మీడియా జనాలు గుర్తు చేసి అడిగితే చెప్పారు తప్ప, ఆయన అంతట ఆయన కాదు.
ఇక్కడ సమస్య ఏమిటంటే, బన్నీ సినిమా తరువాత మహేష్ సినిమా అనేది ఫ్యాన్స్ డైజస్ట్ చేసుకునే విషయం కాదు. మహేష్ సంగతి ఎలా వున్నా యూనిట్ కూడా ఈ విషయంలో వెనక్కు తగ్గేలా లేదు. అందువల్ల పోటా పోటీ పోస్టర్లు, దాని మీద మీడియా రియాక్షన్, దానిపై ఫ్యాన్స్ రుసరుసలు, ఇవన్నీ చైన్ రియాక్షన్ల మాదిరిగా జరుగుతూనే వున్నాయి. ఇంకా కొన్నాళ్లు వుంటాయేమో?