సినిమా రివ్యూ: మా వింత గాధ వినుమా
రేటింగ్: 2/5
బ్యానర్: సిల్లీ మాంక్స్ స్టూడియోస్, ఆర్యత్ సినీ ఎంటర్టైన్మెంట్స్, మెలోడ్రామా స్టూడియోస్
తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్, తనికెళ్ల భరణి, ప్రగతి, జయప్రకాష్, కమల్ కామరాజు, కల్పిక, రాజేశ్వరి నాయర్, ఫిష్ వెంకట్ తదితరులు
రచన: సిద్ధు జొన్నలగడ్డ
నేపథ్య సంగీతం: రోహిత్ పసుపర్తి, జాయ్ రాయరాల
సంగీతం: శ్రీచరణ్ పాకాల
కూర్పు: వంశీ అట్లూరి, సిద్ధు జొన్నలగడ్డ
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు
నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లల, కీర్తి చిలుకూరి, జి. సునీత
దర్శకత్వం: అదిత్య మండల
విడుదల తేదీ: నవంబరు 13, 2020
వేదిక: ఆహా
‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంతో ఈతరం యువతకు నచ్చే అంశాలున్న సినిమా అందించడంలో సిద్ధ హస్తుడనిపించుకున్నాడు సిద్ధు. అయితే యూత్‌ని మెప్పించడం ఎంత తేలికో అంత కష్టం కూడా. అది ‘మా వింత గాధ వినుమా’తో సిద్ధు తెలుసుకుంటాడు. వాళ్లకు నచ్చే కాంటెంపరరీ ఎలిమెంట్స్ కథలోకి చొప్పించగలిగి… విసుగెత్తించకుండా కథ చెబితే యూత్ మార్కులేసేస్తారు. అయితే కాంటెంపరరీ ఎలిమెంట్స్ జోడిస్తూ కథ నడిపించడం రోప్ వాక్ లాంటిది. ఏమాత్రం బ్యాలన్స్ తప్పినా బోర్లా పడిపోతారు. కృష్ణ అండ్ హిజ్ లీల విషయంలో కుదిరిన ఆ బ్యాలన్స్ ‘మా వింత గాధ వినుమా’లో కుదరలేదు.
ఈ చిత్రంలో యూత్ ఇన్‌స్టంట్‌గా కనక్ట్ అయ్యే ‘వైరల్ వీడియో’ టాపిక్‌ని ఎంచుకున్నాడు సిద్ధు. ఒక పర్సనల్ వీడియో కనుక ఇంటర్నెట్లో అప్లోడ్ అయి, వైరల్ అయితే ఆ వీడియోలోని వ్యక్తుల భవిష్యత్తు, వారికి సంబంధించిన వారి జీవితాలు ఎలా ఎఫెక్ట్ అవుతాయనేది ఈ చిత్రంలోని మెయిన్ ప్లాటు. అయితే ఈ పాయింట్‌కి ముందు, వెనుక ఏమి చేయాలనే దానిపై ఈ చిత్రానికి రచయిత కూడా అయిన సిద్ధు ఎక్కువ ఆలోచించినట్టు లేడు. యూత్‌కి నచ్చాలంటే నాలుగు బూతు మాటలు, వారు రిలేట్ చేసుకునే రెండు సన్నివేశాలు వుంటే చాలనుకున్నాడు. వింత ఏమిటంటే… కనీసం సదరు వైరల్ వీడియోకి సంబంధించిన సీన్ కూడా సరిగా రాసుకోలేదు.
‘కృష్ణ అండ్ హిజ్ లీల’ థియేటర్లకోసం తీసి, ఓటిటిలో వచ్చిన సినిమా అయితే… ‘మా.వి.గా.వి.’ అచ్చంగా ఓటిటి కోసం చేసిన సినిమాలా వుంది. అందుకే ఇక్కడ అక్కడ తీసుకున్న జాగ్రత్త, శ్రద్ధ మచ్చుకైనా కనిపించవు. పోలీస్ అయిన తనికెళ్ల భరణికి రెండు దఫాలు దొరికి తన కథను రెండు విడతలుగా చెబుతాడు సిద్ధు. అయితే అతడు చెప్పే కథ కంటే… బ్రేక్ ఇచ్చినపుడు భరణితో పెట్టుకునే బాతాఖానీ బెటర్ అనిపిస్తుంది. రెండోసారి కథ చెప్పినప్పుడు కేవలం భరణి వుంటే ఫన్ సరిపోదని, ఫిష్ వెంకట్‌ని తెచ్చి అతడితో కాసిని బూతులు మాట్లాడించారు.
ఒక పోలీసోడు పని మానేసుకుని మరీ వినేంత స్టఫ్ అయితే సిద్ధు కాలేజ్ లవ్‌స్టోరీలో లేదు. ఆ కథను బ్రేకులిచ్చి మరీ ఆసక్తిగా చెప్పాలని చూస్తాడు కానీ అదంతా ‘లాగుతున్నట్టు’ అనిపిస్తుందే తప్ప అక్కడ లవ్వేమీ కనిపించదు. ఎటు పోతుందో అర్థం కాని ఈ కథ సడన్‌గా గోవాకి షిఫ్ట్ అవుతుంది. వైరల్ వీడియో చేయడానికి గోవా బ్యాక్‌డ్రాప్ బెస్ట్ అనిపించి అక్కడకు వెళ్లుంటారనుకోవాలి. సడన్‌గా పెళ్లి చేసుకోవడం కూడా వీడియో కోసం చేసిన కన్వీనియంట్ మూవ్లానే వుంటుంది. ఈ వైరల్ వీడియో హంగామాతో ఎంత హల్చల్ చేసినా కానీ అది ఎమోషనల్‌గా ఏమాత్రం కనక్ట్ చేయకపోగా బ్రేకప్ కోసం జరుగుతోన్న కన్వీనియంట్ తంతులా వుంటుంది. అన్నట్టు… వైరల్ వీడియో ఎఫెక్టు వల్ల జీవితాలు ఎలా తల్లకిందులు అవుతాయో… దాని వల్ల జరిగే పరిణామాలెలా వుంటాయనేది ‘వికృతి’ అనే మలయాళ చిత్రంలో హృద్యంగా చూపించారు. వీలుంటే ఆ సినిమా ఒకసారి చూడండి.
నువ్వు చేసిన తప్పు నువ్వే దిద్దుకోవాలి తన తండ్రి చెప్పడంతో హీరో కార్యోన్ముఖుడై వెళుతోంటే… ఏమి చేస్తాడో ఏమో అనుకుంటాం. అతను మరో వీడియో షూట్ చేసి తన బాధను అందులో వెలిబుచ్చడంతో అంతవరకు వున్న అడ్డంకులన్నీ తొలగిపోయి అన్నీ సెట్ అయిపోతాయి. కాకపోతే అక్కడ చెప్పే ఒక పాయింట్ బాగుంది. ఆ వీడియోనే కనుక వైరల్ కాకపోయినట్టయితే అది తమ జీవితాల్లో ఒక మంచి మోమెంట్ అయి వుండేదని, కానీ అది అలా ఇంటర్నెట్లో పడి చాలా మంది జీవితాలను ఎఫెక్ట్ చేసిందని చెబుతాడు. ఆ వీడియోని ఇప్పుడందరూ మరచిపోయినా కానీ తాము మాత్రం ఆ వీడియో దగ్గరే ఆగిపోయామని అంటాడు. నిజమే ప్రైవేట్ మూమెంట్స్‌ని చిత్రీకరించుకుని పొరపాటున అయినా ఇంటర్నెట్లో పెడితే కొందరి జీవితాలను అవి శాశ్వతంగా ఎఫెక్ట్ చేస్తాయి. అయితే ఈ మెసేజ్‌ని వాట్సాప్‌లో అయినా ఫార్వార్డ్ చేసుకోవచ్చు. లేదా షార్ట్ ఫిలింగా తీసి యూట్యూబ్‌లో పెట్టుండొచ్చు. సిద్ధు ఏకంగా సినిమానే తీసి ఆహాకిచ్చేసాడు.
సిద్ధు ఎఫర్ట్‌లెస్ యాక్టింగ్‌తో ఇలాంటి పాత్రలకు బాగా సూటవుతానని మరోసారి చాటుకున్నాడు. సీరత్ కపూర్ తన పూర్వపు లుక్‌కి పూర్తి భిన్నంగా కనిపిస్తూ కనీసం నటిగానూ మెప్పించలేకపోయింది. ప్రగతి నటన కాస్త ఓవర్ ది బోర్డ్ వెళ్లినట్టు అనిపిస్తుంది. తనికెళ్ల భరణి సహజ నటన, సంభాషణలు విసిగించే ఈ చిత్రంలో ఉపశమనంగా పని చేసాయి. తెరవెనుక ప్రతిభ గురించి చెప్పుకుంటే నేపథ్య సంగీతం బాగుంది. కృష్ణ అండ్ హిజ్ లీలలో మెప్పించిన క్లాసికల్ టచ్ ఈసారి కూడా విడిచి పెట్టలేదు. టైటిల్ జస్టిఫికేషన్ కోసం ‘రావోయి చందమామ మా వింత గాధ వినుమా’ పాటను ఫుల్‌గా పెట్టేసుకుని, బ్లాక్ అండ్ వైట్‌లో సన్నివేశాలను చూపించినా కానీ ఆ పాటకు ఈ దృశ్యాలను చూసి మెచ్చుకోవడం బహు కష్టం.
ట్రెండింగ్ పదజాలం, కాంటెంపరరీ యూత్ భావజాలం మాత్రం వుంటే ఎలాంటి వింత గాధలు తీసినా ఓటిటి యువసేన ఓటేసేస్తారనుకుంటే ఇలాంటి ఎందుకూ కొరగాని సినిమాలే రూపొందుతాయి. యూట్యూబ్‌కి ఎక్కువ… సినిమాకు తక్కువ అన్నట్టుంటే ఓటిటికి సరిపోతుందని భ్రమిస్తే ఇలాంటి అరకొర సినిమాలతో అక్షింతలేయించుకోవాలి.
బాటమ్ లైన్: ఇదో వింత బాధ సుమా!