తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గట్టిగానే భయపడుతున్నట్టుగా ఉన్నారు. ఒకవైపు పూల వర్షంలో తడిసిన మరుసటి రోజే ఆయన వెళ్లి గవర్నర్ ను కలిసి మొరపెట్టుకోవడం ఆయనలోని భయాన్ని చాటుతూ ఉందని పరిశీలకులు అంటున్నారు. మండలి రద్దు అంటూ జగన్ చేస్తున్న ఆలోచనే చంద్రబాబును భయపెట్టిందో, అదే జరిగితే తన తనయుడు ఒట్టి మాజీ ఎమ్మెల్సీగా మిగిలిపోతాడనే తండ్రి ప్రేమే ఆయనను నడిపించిందో, లేక మండలి రద్దు కాకపోయినా.. ఆ బిల్లులు మాత్రం ఆగవనే విషయమే కదిలించిందో కానీ.. చంద్రబాబు నాయుడు గవర్నర్ ను కలిసేసి తన భయాన్ని చాటుకున్నారు.
ప్రతిపక్ష నేత వెళ్లి గవర్నర్ ను కలిసి మొర పెట్టుకోవడం అనేది కొత్త కాదు. అయితే ఒక ఎపిసోడ్ మధ్యలోనే వెళ్లి చంద్రబాబు నాయుడు గవర్నర్ ను కలిశారు. ఆయనకు తన బాధలేవో చెప్పుకున్నారు. ఇంకా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉన్నట్టే. సోమవారం కూడా అసెంబ్లీ సమావేశం కాబోతోంది. ఇలాంటి నేపథ్యంలో.. మండలి విషయంలో ప్రభుత్వం ఆలోచన సోమవారంతో బయటపడుతుంది. అప్పుడు తీరికగా గవర్నర్ వద్దకు వెళ్లవచ్చు చంద్రబాబు నాయుడు.
అయితే అంతవరకూ ఆగేలా లేరు. మండలి రద్దు అయితే తెలుగుదేశం పార్టీకి గట్టి ఝలక్ అవుతుంది. ఒకప్పుడు మండలి టైమ్ వేస్ట్ అని చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు. అయితే ఇప్పడు అదే మండలి తన తనయుడికి రాజకీయ భిక్షగా మారింది. తన పార్టీ తరఫున ఏదో రాజకీయం చేసేందుకు మండలి చంద్రబాబు కు వేదికగా మారింది. ఇలాంటి నేపథ్యంలో.. ఆయన మండలి రద్దును వ్యతిరేకిస్తున్నారు. జగన్ ప్రసంగంతో చంద్రబాబు బెంబేలెత్తిపోయారు. గవర్నర్ ను కలిసి లాంఛనం పూర్తి చేశారు. ఇప్పుడు మండలి రద్దు అయినా కాకపోయినా.. జగన్ ప్రసంగంతో చంద్రబాబు నాయుడు భయపడిన వైనం మాత్రం స్పష్టం అవుతోందని పరిశీలకులు అంటున్నారు.