ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ తీరు ఒకింత గందరగోళాన్ని మిగులుస్తోంది. తీవ్ర చర్చనీయాంశంగా నిలిచిన ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి వెళ్లాయని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. అది తమ విజయం అని.. చంద్రబాబు నాయుడు పూల వర్షం కూడా ఏర్పాటు చేయించుకున్నారు. అయితే మండలి చైర్మన్ షరీఫ్ తాజా ప్రకటన తెలుగుదేశం పార్టీ ప్రచారం అబద్ధం అనేలా ఉంది. ఆ బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదు అని ఆయన వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి.
చట్టానికి లోబడి కాకుండా, తన విచక్షణాధికారం మేరకు ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినట్టుగా షరీఫ్ ప్రకటించినట్టుగా మొదటి వార్తలు వచ్చాయి. ఆ తర్వాతే తెలుగుదేశం సంబరాలు షురూ అయ్యాయి. ఆ వెంటనే మండలి రద్దు ఆలోచనను ప్రభుత్వం చేసింది. ఇలాంటి నేపథ్యంలో షరీఫ్ ప్రకటన ఒకింత గందరగోళంగా మారుతూ ఉంది.
ఆ బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపలేదని, మండలిలో అవి అర్ధాంతరంగా ఆగిపోయినట్టుగా షరీఫ్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. దీంతో అవి సెలెక్ట్ కమిటీకి వెళ్లినట్టా, లేదా.. అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అధికారిక ప్రకటనలు ఎలా వస్తాయనేది ఆసక్తిదాయకంగా మారింది. తెలుగుదేశం ఏమో ఆ బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లాయని అంటోంది, మండలి చైర్మన్ మరో రకమైన ప్రకటన చేశారు. మరి ఇంతకీ ఆ బిల్లుల తాజా పరిస్థితి ఏమిటి? మండలి మళ్లీ సమావేశం అవుతుందా? ఆ బిల్లులపై ఏదో ఒకటి తేలుస్తుందా.. అనేది సందేహంగా మారింది. ఇంతకీ ఆ ప్రాసెస్ ఏమైందనే అంశం గురించి ప్రభుత్వం ఏం చెబుతుందో!