హైదరాబాదీ దియా మీర్జా నాగార్జున సినిమాలో హీరోయిన్ గా నటించబోతోందని వార్తలు వస్తున్నాయి. వైల్డ్ డాగ్ పేరుతో రూపొందుతున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించడం ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. దియా మీర్జాది హైదరాబాదే అయినా ఇప్పుడు ఆమె తెలుగు సినిమాలో తొలిసారి కనిపిస్తూ ఉంది. బాలీవుడ్ లో ఇన్నేళ్లు సెటిలైన దియా ఇప్పుడు టాలీవుడ్ కు వస్తోంది.
బాలీవుడ్ లో హీరోయిన్ గా మరీ సక్సెస్ కాలేకపోయింది దియా. మున్నాభాయ్ సినిమాల్లో కనిపించి ఆకట్టుకుంది. అది ఇప్పటి కథ కాదు. 15 యేళ్ల కిందటి సినిమాలు అవి. అప్పట్లో దియా చాలా గ్లామరస్ గా ఉండేది. క్రమంగా వయసు మీద పడింది, పెళ్లి-పిల్లలు-విడాకులు.. వీటితో వార్తల్లోకి వచ్చింది. వయసుకు తగ్గట్టుగా దియా మీర్జా ఇప్పుడు పాత గ్లామర్ తో కనిపించడం లేదు.
విశేషం ఏమిటంటే.. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత తీవ్రంగా ఉంది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి దాదాపుగా నలుగురి పరిస్థితీ అలానే ఉంది. కుర్ర అమ్మాయిలతో జతకడితే విమర్శలు వస్తున్నాయి. లేకపోతే ఇలా ముదురు భామలను తెచ్చుకోవాలి. కానీ సినిమాలో గ్లామరస్ హీరోయిన్ ను ఎక్స్ పెక్ట్ చేసే జనాలు..పదిహేనేళ్ల కిందటి హీరోయిన్లను ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు. టాలీవుడ్ సీనియర్ల సినిమాల్లో గ్లామరస్ హీరోయిన్లు ఇక కష్టమే కావొచ్చు!