ఎన్నికలకు ముందు హామీలతో ప్రజల్లోకి వెళ్లారు. సుదీర్ఘంగా సాగిన ప్రజాసంకల్ప యాత్రలో దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల మధ్యనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి జనంలోకి వెళ్లబోతున్నారు జగన్. ప్రజలు కట్టబెట్టిన ముఖ్యమంత్రి పదవితో, ప్రజల్లోకే వెళ్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్ని, ఎలా నెరవేరుస్తున్నామో ప్రజలకు చెప్పబోతున్నారు సీఎం.
కుదిరితే ఫిబ్రవరి 1 నుంచి జనంలోకి వెళ్లాలని జగన్ నిర్ణయించారు. తన పాలనపై ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకుంటారు. ఈ విషయంలో చంద్రబాబు చేసిన తప్పును జగన్ చేయడం లేదు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజలను పట్టించుకోవడం మానేశారు. పూర్తిగా ఆఫీస్ కే పరిమితమైపోయారు. మధ్యమధ్యలో కార్యక్రమాలు ఏర్పాటుచేసినప్పటికీ అవన్నీ ప్రభుత్వ లేదా రాజకీయ కార్యక్రమాలు మాత్రమే. ప్రజల అభిప్రాయాల్ని మాత్రం పెడచెవిన పెట్టారు. ఇప్పుడు దానికి మూల్యం చెల్లించారు. ఈ విషయంలో జగన్ ముందుగానే మేల్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలలకే ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారు.
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి విప్లవాత్మక విధానాలతో, సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు జగన్. అధినేత తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజలు ఆమోదిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొన్ని నిర్ణయాల వల్ల ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందిపడిన మాట కూడా వాస్తవం. అలా ఈ 7 నెలల్లో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులతో పాటు వాళ్లు బాగా లబ్ది పొందిన అంశాల గురించి జగన్ స్వయంగా అడిగి తెలుసుకుంటారు.
మరీ ముఖ్యంగా రెండు కీలకమైన అంశాలపై ప్రజాభిప్రాయం కోసం జగన్ జనంలోకి వెళ్తున్నారు. వీటిలో ఒకటి గ్రామ సచివాలయ వ్యవస్థ. జగన్ డ్రీమ్ ప్రాజెక్టు ఇది. కొత్తగా ఏర్పాటుచేసిన గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థపై నేరుగా జగన్ ఫీడ్ బ్యాక్ తెలుసుకుంటారు. దీంతో పాటు పేదలకు ఉగాది నాటికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాల అంశంపై కూడా క్షేత్రస్థాయిలో చర్చిస్తారు.
ఈ రెండు కార్యక్రమాల్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటుచేసి, అర్హులకు ఇళ్లపట్టాల్ని అందిస్తే పాలన మొత్తం గాడిలో పడుతుందని నమ్ముతున్నారు ముఖ్యమంత్రి. అందుకే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.