స్వాతంత్ర్య పోరాట రోజుల్లో 'స్వరాజ్యం నా జన్మహక్కు' అని బాలగంగాధర తిలక్ రొమ్ము విడుచుకుని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఆయన స్వాతంత్ర్యం కోసం ఉద్యమించారు. 'సత్యాన్నే పలకాలి' అంటే గాంధీజీ గుర్తు కొస్తారు. 'మాట తప్పను మడమ తిప్పను' అనే మాట వింటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గుర్తుకొస్తారు. అదే 'యూటర్న్' అంటే చంద్రబాబే గుర్తు కొస్తారు. ఎందుకంటే దానిపై ఆయనకే సంపూర్ణ హక్కులు.
దివంగత వైఎస్సార్ గతంలో అన్నట్టు నిజాలు మాట్లాడితే చంద్రబాబు తల పగిలిపోతుందనే శాపం ఉన్నట్టుంది. రుతువులకు తగ్గట్టు కాలంలో, వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నట్టుగా…ప్రతిపక్షంలో ఉంటే ఒకలా, అధికార పక్షంలో ఉంటే మరోలా చంద్రబాబు మాటతీరు ఉంటుంది.
తాజాగా మండలి రద్దుపై జగన్ సర్కార్ ముందడుగు వేస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అసలు మండలిని రద్దు చేయాలని ఆయనే కేంద్రానికి లేఖ రాశారని సమాచారం.
మండలి వద్దనుకున్నప్పుడు బాబు మాటలుః
లెజిస్లేటివ్ కౌన్సిల్ బిల్లు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దాన్ని సభలో ప్రవేశ పెట్టకూడదు. దీనివల్ల వేలాది ట్యాక్స్ పేయర్ల డబ్బు వృథా గా పోతుంది. ప్రజలపై చాలా భారం పడుతుంది. మండలి వల్ల చాలా సమయం వృథా అవుతుంది. మండలి పునరుద్ధరణ పనులను ఉపసంహరించుకోవాలి. దీని అవసరంపై రిఫరెండం నిర్వహించండి.
మండలి కావాలనుకుంటున్న బాబు మాటలుః
శాసనమండలిని రద్దు చేసే అధికారం ముఖ్యమంత్రికి లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం మండలిని రద్దు చేయడం చాలా కష్టం. రద్దు చేసినా ఏడాదిన్నర పడుతుంది. ఒకవేళ ఇప్పుడు కౌన్సిల్‌ను రద్దు చేస్తే మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పెడతాం.
ఏదైనా మాట్లాడగలిగే ఓర్పు, నేర్పు ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉన్నాయి. అసలు మనిషి అంటే కాళ్లపై నిలబడుతాడే తప్ప, మాటపై కాదనేది చంద్రబాబు ఫిలాసఫీ. కన్యాశుల్కం అనే నాటకంలో చెప్పినట్టు ఓపీనియన్స్ మార్చుకోని వాడు పొలిటీషియన్ కాడనేది బాబు సిద్ధాంతం. అన్ని సిద్ధాంతాలను కలుపుకుని తనదంటూ ఓ ప్రత్యేకమైన సిద్ధాంతాన్ని బాబు రచించుకున్నాడు. ఆ సిద్ధాంతమే…. పదవే పరమావధి. దాని కోసం ఏం చేసినా తప్పులేదు. బాబు అప్పుడలా, ఇప్పుడలా అంటూ గుర్తు చేసేవాళ్లదే తప్పు. మాట మార్చడమే బాబు నైజమని తెలిసి కూడా పదేపదే విమర్శిస్తారా? ఎంత ధైర్యం?