విశాఖలో చంద్రబాబు మకాం

తెలుగుదేశం అధినేత చంద్రబాబు చాలాకాలం తరువాత విశాఖ టూర్ కి వస్తున్నారు. చంద్రబాబు గత నెలలోనే విశాఖ రావాల్సి ఉంది. ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని అనుకున్నారు. అయితే…

తెలుగుదేశం అధినేత చంద్రబాబు చాలాకాలం తరువాత విశాఖ టూర్ కి వస్తున్నారు. చంద్రబాబు గత నెలలోనే విశాఖ రావాల్సి ఉంది. ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని అనుకున్నారు. అయితే వీలు పడలేదు.

కానీ అనూహ్యంగా ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ సీటు టీడీపీ పరం అయింది. మంచి ఆధిక్యతతో పార్టీ అభ్యర్ధి విజయఢంకా మోగించారు. దాదాపుగా నాలుగేళ్ళ పాటు పరాజయాల పులకరింతలు కలవరింతలు పడుతూ లేస్తూ వస్తున్న టీడీపీ ఈ విక్టరీ ఎంతో ఊరటను ఇచ్చింది. ఇంతటి ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఇపుడు బాబు విశాఖ పర్యటనకు రావడంతో తమ్ముళ్ళు కూడా హడావుడి చేస్తున్నారు.

ఈ నెల 5న విశాఖ వస్తున్న చంద్రబాబు మకాం వేసి మూడు జిల్లాల పార్టీ నేతలతో వరస భేటీలను నిర్వహిస్తారని తెలుస్తోంది. ఏడాది వ్యవధిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపధ్యంలో పార్టీ శ్రేణులకు దశ దిశను బాబు నిర్దేశించనున్నారని అంటున్నారు.

పార్టీలో ఇప్పటిదాకా చడీ చప్పుడూ చేయని కొంతమంది సీనియర్లు ఇపుడు బయటకు వస్తున్నారు. పార్టీలో టికెట్ల సందడి కూడా నెలకొంది. పాత వారు బయటకు రావడంతో ఇన్నాళ్ళు పార్టీ జెండా మోసిన జూనియర్లు ఇపుడు కొంత అభద్రతా భావంతో ఉన్నారు.

తమకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని వారు కోరుతున్నారు. తెలుగుదేశం తరఫున పనిచేసే వారికే టికెట్లు అని చంద్రబాబు చాలా కాలం నుంచి చెబుతూ వస్తున్నారు. ఈసారి ఆ మాటను నిలబెట్టుకోవాలని నేతలు కొంతమంది కోరబోతున్నారు అని చెబుతున్నారు.

మూడు జిల్లాలలో పార్టీలో కొంత వర్గ పోరు ఉంది. అలాగే ఇంకా నిస్తేజంగా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నింటినీ సమీక్షించి పార్టీకి ఒక డైరెక్షన్ ఇస్తారని అంటున్నారు. చంద్రబాబు ఈ నెల 5న విశాఖ వస్తున్నారు. డే లాంగ్ రివ్యూస్ ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం 

అయితే చంద్రబాబు ఒకటి రెండు రోజులు విశాఖలో ఉంటారని అంటున్నారు. చంద్రబాబు చాలా కాలానికి రావడం ఉత్తరాంధ్రాలో టీడీపీకి చిన్న ఆశాకిరణంలా గెలుపు దక్కడంతో విశాఖ వేదికగా బాబు ఏ రకమైన సంచలన ప్రకటనలు చేస్తారు అన్నది తమ్ముళ్ళతో పాటు రాజకీయ వర్గాలలో కూడా ఉత్కంఠంగా ఉంది.