ఉన్నట్టుండి ట్విట్టర్ పక్షి ఎగిరిపోయింది

నిరంతరం ట్విట్టర్ లో కనిపించే వ్యక్తిని ట్విట్టర్ పక్షి అంటారు. క్షేత్రస్థాయిలో రాజకీయాలు చేయకుండా నిత్యం ట్వీట్లు వేసే పొలిటీషియన్ పై ఈ విమర్శ ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఇకపై ఈ పదప్రయోగం చెల్లదు.…

నిరంతరం ట్విట్టర్ లో కనిపించే వ్యక్తిని ట్విట్టర్ పక్షి అంటారు. క్షేత్రస్థాయిలో రాజకీయాలు చేయకుండా నిత్యం ట్వీట్లు వేసే పొలిటీషియన్ పై ఈ విమర్శ ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఇకపై ఈ పదప్రయోగం చెల్లదు. ట్విట్టర్ పక్షి ఎగిరిపోయింది.

అవును.. నిజంగానే ట్విట్టర్ పక్షి ఎగిరిపోయింది. ఇన్నాళ్లూ ట్విట్టర్ కు సింబల్ గా ఉన్న నీలం రంగు పక్షి లోగోను తొలిగించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ మార్పుపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బ్లూ బర్డ్ స్థానంలో డోజ్ బొమ్మ వచ్చింది. క్రిప్టో కరెన్సీ అయిన డోజ్ కాయిన్ పై ఉండే బొమ్మ ఇది. నిజానికి జపాన్ దేశానికి చెందిన ఓ కుక్క జాతిని డోజీగా పిలుస్తారు.

క్రిప్టో కరెన్సీకి చెందిన డోజ్ కాయిన్ కు ఆది నుంచి మద్దతుగా నిలిచారు మస్క్. ట్విట్టర్ లో దీన్ని ఎక్కువగా ప్రమోట్ చేసిన వ్యక్తి కూడా ఆయనే. ట్విట్టర్ ను టేకోవర్ చేయడానికి ముందు ఓ నెటిజన్, మస్క్ కు ఈ సూచన చేశాడు. ఒకవేళ ట్విట్టర్ ను కొనుగోలు చేస్తే డోజ్ ను లోగోగా పెట్టాలని అన్నాడు.

దానికి అప్పట్లో సానుకూలంగా స్పందించిన మస్క్, అన్నంతపని చేశారు. బ్లూ బర్డ్ స్థానంలో డోజ్ వచ్చి చేరింది. తాజా మార్పుతో డోజీ కాయిన్ విలువ 22శాతం పెరగడం విశేషం.

ట్విట్టర్ ను దక్కించుకున్న మరుక్షణం నుంచి అందులో తనదైన మార్పుచేర్పులు చేస్తున్నారు మస్క్. ఇప్పటికే పలు రకాల టిక్ మార్క్స్ ప్రవేశపెట్టడంతో పాటు, దానికి సబ్ స్క్రిప్షన్ కూడా జోడించారు. మెసేజింగ్ లో మార్పులతో పాటు, ఇంటర్ ఫేజ్ ను కూడా మార్చారు. తాజాగా ఏకంగా లోగోను మార్చి ట్విట్టర్ పై తన ఫోకస్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పారు మస్క్.