టీడీపీలో ప‌వ‌న్ టెన్ష‌న్‌!

జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకోవ‌డంపై టీడీపీలో భిన్నాభిప్రాయాలున్నాయి. టీడీపీ యువ‌త మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌న‌సేనానితో పొత్తు వద్ద‌ని చంద్ర‌బాబుకు తెగేసి చెబుతున్నారు. కానీ సీనియ‌ర్ నేత‌లు మాత్రం ప‌వ‌న్‌తో పొత్తు కుదుర్చుకుంటే మంచిద‌ని బాబుకు…

జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకోవ‌డంపై టీడీపీలో భిన్నాభిప్రాయాలున్నాయి. టీడీపీ యువ‌త మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌న‌సేనానితో పొత్తు వద్ద‌ని చంద్ర‌బాబుకు తెగేసి చెబుతున్నారు. కానీ సీనియ‌ర్ నేత‌లు మాత్రం ప‌వ‌న్‌తో పొత్తు కుదుర్చుకుంటే మంచిద‌ని బాబుకు సూచిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా లోకేశ్ జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేయ‌డానికి ఆస‌క్తిగా లేర‌ని స‌మాచారం. 2014లో త‌న వ‌ల్లే టీడీపీ అధికారంలోకి వ‌చ్చింద‌ని, అది త‌న భిక్ష అంటూ ప‌వ‌న్ అవ‌మానించేలా మాట్లాడార‌ని లోకేశ్ త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోయార‌ని స‌మాచారం.

మ‌రోవైపు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విజ‌యంతో ఇక త‌మ‌దే అధికారం అన్న ధీమా టీడీపీలో పెరిగింది. పొత్తుల‌తో సంబంధం లేకుండానే వైసీపీని ఓడిస్తామ‌నే భ‌రోసా టీడీపీలో బ‌లంగా వుంది. దీంతో జ‌న‌సేనాని ప‌వ‌న్ వ‌ద్ద‌కు త‌న‌కు తానుగా వెళ్ల‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌లో టీడీపీ వుంది. కొన్ని రోజులుగా టీడీపీలో వ‌చ్చిన మార్పును ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, జ‌న‌సేన నాయ‌కులు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు.

త‌మకు గౌర‌వ‌ప్ర‌ద‌మైన సీట్లు ఇస్తార‌నే న‌మ్మ‌కం జ‌న‌సేన‌లో స‌న్న‌గిల్లింద‌నే వార్త‌లొస్తున్నాయి. ఇలాగైతే తాము న‌ష్ట‌పోతామ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ్ర‌హించార‌ని చెబుతున్నారు. దీంతో ఆల్రెడీ పొత్తులో ఉన్న బీజేపీతోనే క‌లిసి వెళితే బాగుంటుంద‌నే పున‌రాలోచ‌న ప‌వ‌న్‌లో మొద‌లైంద‌ని జ‌న‌సేన నాయ‌కులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం బీజేపీ ఏపీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జ్ ముర‌ళీధ‌ర‌న్‌తో భేటీ కావ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా చెప్పొచ్చు. ఇవాళ‌ అమిత్‌షా, న‌డ్డాతో భేటీ కానున్నారని స‌మాచారం. వీళ్ల‌ద్ద‌రితో భేటీ త‌ర్వాత వైసీపీని గ‌ద్దె దించ‌డానికి కార్యాచ‌ర‌ణ రూపొందించే అవ‌కాశాలున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌ను టీడీపీ నిశితంగా ప‌రిశీలిస్తోంది. ఒక‌వేళ త‌మ‌ను కాద‌ని, బీజేపీతోనే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎన్నిక‌ల‌కు వెళితే లాభ‌న‌ష్టాల‌పై టీడీపీ లెక్క‌లేస్తోంది. 2019లో మాదిరిగానే జ‌న‌సేన త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోతే అధికారానికి దూర‌మ‌వుతామా? అనే కోణంలో టీడీపీ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్‌లో అక‌స్మాత్తుగా వ‌చ్చిన మార్పున‌కు కార‌ణాలేంటో టీడీపీ వెతుకుతోంది. 

ఇంత కాలం జ‌గ‌న్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌నివ్వ‌న‌ని, అందుకు తానే నాయ‌క‌త్వం వ‌హిస్తాన‌ని చెప్పి, ఇప్పుడు బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో చ‌ర్చించ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏంట‌నేది టీడీపీకి అంతుబ‌ట్ట‌డం లేదు.

ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా వెళ్లి వీర‌మ‌ర‌ణం పొంద‌లేన‌న్న మాట‌ల‌న్నీ ఉత్తుత్తిదేనా? అని టీడీపీ ప్ర‌శ్నిస్తోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏ మాత్రం త‌మ నుంచి చేజారినా దాడి చేయ‌డానికి టీడీపీ సిద్ధంగా ఉన్న‌ట్టు స‌మాచారం. అయితే అమిత్‌షా, న‌డ్డాతో భేటీ త‌ర్వాత రానున్న ఎన్నిక‌ల్లో పోటీపై ప‌వ‌న్ ఒక స్ప‌ష్ట‌త ఇచ్చే అవ‌కాశం ఉంది. దానిపై టీడీపీలో ఉత్కంఠ‌, అయోమ‌యం నెల‌కుంద‌న్న‌ది వాస్త‌వం.