ఏపీ శాసన మండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్నారు. ఈ విషయం ఈరోజు అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు. మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఎ రద్దు బిల్లును మండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్న తరువాత రగిలిపోతున్న జగన్ ఈ రోజు అసెంబ్లీలో మండలి గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. మధ్యలో నిన్న మండలిలో ఛైర్మన్ షరీఫ్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయం ప్రకటించేముందు చేసిన సుమారు పది నిమిషాల ప్రసంగం వీడియో క్లిప్‌ను సభలో ప్రదర్శించారు. ఉద్దేశపూర్వకంగానే (ఛైర్మన్ షరీఫ్ టీడీపీ వ్యక్తి కాబట్టి) బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారని జగన్ చెప్పారు.
హత్య చేయడం నేరమని తెలిసినా హత్య చేస్తున్నానని చెప్పి హత్య చేశారని అన్నారు. సో….ఇలాంటి మండలి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు అడ్డంకిగా ఉంది కాబట్టి దాన్ని రద్దు చేసే విషయం స్పీకర్‌తో సహా సభ్యులంతా సీరియస్‌గా ఆలోచించాలన్నారు. ఇంగ్లిషు మీడియం బిల్లును మండలిలో అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న జగన్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. మండలి నిర్వహణకు ఏడాదికి 60 కోట్లు ఖర్చువుతుందని, అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రంలో మండలిని భరించడం అవసరమా? అని ప్రశ్నించారు.
దేశంలోని ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మండలి ఉందని, దాన్ని ఉంచడం, ఉంచకపోవడం పూర్తిగా రాష్ట్రాల ఇష్టమని జగన్ చెప్పారు. కాబట్టి ప్రభుత్వానికి భారంగా, అడ్డంకిగా మారిన మండలి అవసరం లేదని చెప్పారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించడానికి సోమవారం అసెంబ్లీని సమావేశపరచాలని జగన్ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరగా, ఆయన అందుకు అంగీకరించారు. దీన్నిబట్టి త్వరలోనే మండలి రద్దువుతుందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్టీ రామారావు మండలిని రద్దు చేసిన సంగతి తెలిసిందే. దాన్ని చాలా ఏళ్ల తరువాత రాజశేఖర రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు పునరుద్ధరించారు.
మండలిని రద్దు చేయడానికి, అవసరమైతే మళ్లీ పునరుద్ధరించడానికి కేంద్రం తమకు సహకరిస్తుందని ఈమధ్య వైకాపా అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి ఓ టీవీ చర్చలో చెప్పాడు. ఆనాడు ఎన్టీఆర్ మండలిలో కాంగ్రెసు నాయకుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయనే అభిప్రాయంతో, అది లేకపోయినా నష్టం లేదంటూ రద్దు చేసిపారేశారు. ఇప్పుడు జగన్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. మండలిలో టీడీపీకి భారీ మెజారిటీ ఉండటంతో ఆయనకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇబ్బందులు అంటే ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందకుండా అడ్డుకోవడమే.
అయితే ఇలా అడ్డుకోవడం శాశ్వతంగా ఉండదనుకోండి. కాని ప్రభుత్వానికి చిరాకు కలుగుతుంది. మండలి రద్దు వల్ల ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయవచ్చు. కాని అదే సమయంలో అధికార పక్షానికి కూడా నష్టం కలుగుతుంది. సాధారణంగా ఎమ్మెల్యేలుగా గెలవనివారికి మండలిలో చోటు కల్పిస్తారు. అలాగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ప్రతినిధులకు మండలిలో స్థానాలు దక్కుతాయి. మండలి రద్దయితే అధికార పక్షం నేతలకు పదవులు ఇవ్వడం కష్టంగా ఉంటుంది. జగన్ రెండేళ్లు ఆగితే వైకాపాకు మెజారిటీ రావచ్చేమో…! కాని ఆయన అప్పటివరకు ఆగుతారా? అనే సందేహం కలుగుతోంది.
శాసన సభలో వైకాపాకు 151 మంది సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే కదా. మండలిలోని మొత్తం మంది సభ్యుల్లో వైకాపాకు 9 మంది సభ్యులు ఉండగా, టీడీపీకి భారీగా సభ్యులున్నారు. అయితే ఈ సమావేశాల్లోనే ముగ్గురు టీడీపీకి గుడ్‌బై చెప్పేశారనుకోండి. ఇక సభ్యుల్లో మిగిలినవారు ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎన్నికైనవారు. కొందరు నామినేటెడ్ సభ్యులు. మండలిలోని 58 మంది సభ్యుల్లో 2021 నాటికి మూడొంతులమంది పదవీ విరమణ చేస్తారు. అంటే రిటైర్ అవుతారన్నమాట.
వీరిలో సహజంగానే టీడీపీవారు ఎక్కువమంది ఉంటారు. వైకాపాకు శాసన సభలో బండ మెజారిటీ ఉంది కాబట్టి దాదాపు 15 సీట్లు ఆ పార్టీకే దక్కుతాయి. అయినప్పటికీ చాలినంత మెజారిటీ ఉండదని జగన్ అభిప్రాయం. దానికితోడు ఇప్పుడు మండలి ఛైర్మన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం కారణంగా కోపం నషాళానికి అంటిన జగన్ రద్దుకు ఉద్యుక్తుడయ్యారు. ఆయన సభలో దీన్ని గురించి మాట్లాడుతుండగానే మండలిని రద్దు చేయాలని వైకాపా సభ్యులు బల్లలు చరిచారు.
ఈ పప్పు నాయుడికి రాజకీయ బిక్ష పెట్టిందే రాజశేఖర్ రెడ్డి గారు