తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు వితండవాదం చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎన్నికల్లో స్పష్టంగా ఓడిపోయినప్పటికీ ఆయన తన ఓటమిని అంగీకరించడం లేదు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లడమైతే దాదాపు ఖరారైంది.
ట్రంప్ కు చెందిన ఎన్నికల ప్రచార కమిటీ ఈ విషయాన్ని నిర్థారించింది కూడా. అయితే ఎన్నికల ఫలితాల్ని సవాల్ చేసే క్రమంలో ట్రంప్, వైట్ హౌజ్ ను ఖాళీ చేయడానికి నిరాకరిస్తే ఏమౌతుందనేది ఇప్పుడు అసలు సమస్య.
అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఏ అధ్యక్షుడు ఇలా మొరాయించలేదు. ఓటమి తర్వాత అంతా హుందాగా శ్వేతసౌధం నుంచి తప్పుకున్నవాళ్లే. ట్రంప్ మాత్రం ఈసారి పేచీ పెట్టే అవకాశం ఉందని యూఎస్ మీడియా అంచనా వేస్తోంది.
ఎన్నికల ఫలితాలపై కోర్టుకు వెళ్లడంతో పాటు.. పరిపాలనను తానే కొనసాగిస్తానని ట్రంప్ వితండవాదం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
వైట్ హౌజ్ ను ఖాళీ చేయడానికి ట్రంప్ నిరాకరిస్తే ఏం చేస్తారనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. యూఎస్ రాజ్యాంగంలో కూడా దీనిపై ఎలాంటి సూచనలు లేవంటున్నారు నిపుణులు.
ప్రజాస్వామ్యంలో అధికార మార్పిడి జరిగినప్పుడు భవనాలు ఖాళీ చేయడానికి సంబంధించి మార్గదర్శకాలు ఉన్నాయి తప్పితే, కోర్టులో కేసు వేసి అధికారిక నివాసం (శ్వేత సౌధం)లో కొనసాగితే ఏం చేయాలనే అంశంపై సూచనలు లేవు.
దీంతో రాజకీయ విశ్లేషకుల్లో కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సైన్యం రంగంలోకి దిగి ట్రంప్ ను వైట్ హౌజ్ నుంచి ఖాళీ చేయిస్తుందని కొందరు అంటున్నారు.
ఇదే కనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా అమెరికా పరువు పోయినట్టే. స్వయంగా సైన్యం రంగంలోకి దిగితే పాకిస్థాన్ కు, అమెరికాకు తేడా ఏముంటుంది. ప్రజాస్వామ్యం అంటూ నీతులు చెప్పే అమెరికాకు ఇకపై అలా మాట్లాడే అధికారం-హక్కు ఉండదు.
సరిగ్గా ఇక్కడే మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు మరో విధంగా స్పందిస్తున్నారు. సైన్యాన్ని రంగంలోకి దించకుండా.. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ రంగంలోకి దిగుతారని వాళ్లు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడికి భద్రత అందించే విభాగం ఇది.
వీళ్లు ట్రంప్ ను వైజ్ హౌజ్ నుంచి ఖాళీ చేయించే బాధ్యతను తీసుకుంటారని కొందరు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షులు, మాజీ అధ్యక్షుల భద్రతను ఈ ఏజెన్సీ చూస్తుంది. తాజాగా గెలిచిన జో బైడెన్ కు కూడా ఆల్రెడీ అధ్యక్షుడి స్థాయి భద్రతను కల్పించింది ఈ ఏజెన్సీ.
అయితే సైనిక బలగాలు కూడా ట్రంప్ తో కలిస్తే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. నిజానికి అమెరికా సైనిక బలగాలు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాయి, అధ్యక్షుడి ఆదేశాలను మాత్రం పాటిస్తాయి.
నిజంగా ట్రంప్ అంత అనైతికంగా వ్యవహరిస్తే.. సైన్యం పూర్తిగా రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేస్తుందని కొందరు వాదిస్తున్నారు.
అయితే ట్రంప్ గురించి తెలిసినవాళ్లు మాత్రం అతడు అంత బెట్టుచేయకపోవచ్చని అంటున్నారు. జనవరి 20 వరకు ట్రంప్ అధ్యక్ష పదవీకాలం ఉంది. ఈలోగా అతడు అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే అదే పదివేలు అంటున్నారు.