టీడీపీ యువనేత, భవిష్యత్ ఆశాకిరణం నారా లోకేశ్ శాసనమండలిలో గత రెండు రోజులుగా హల్‌చల్ సృష్టిస్తున్నాడు. మండలిలో కీలక బిల్లులపై చర్చల సందర్భంగా సవాళ్లు, ప్రతిసవాళ్లతో లోకేశ్ బిజీబిజీగా ఉన్నాడు. ఏ నాటికైనా కాబోయే సీఎం లోకేశ్ అని సంబరపడుతున్న టీడీపీ నేతలు….నిన్న మండలిలో తమ యువనేతపై మంత్రులు దాడికి యత్నించారని ఆరోపిస్తున్నారు.
అంతటితో ఆగలేదు. లోకేశ్‌ను కొట్టేందుకు మంత్రులు మందు తాగి వచ్చారని వాపోతున్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ విషయాన్ని చెబుతూ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘నిన్న శాసనమండలిలోకి మంత్రులు తాగి వచ్చారు. లోకేశ్‌ను కొట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. సభలో ఎప్పుడూ చూడని పరిణామాలను నిన్న మంత్రులు ప్రదర్శించారు. మండలి రద్దుకు మేం ఎప్పుడూ బాధపడం. అంతేకాదు భయపడం కూడా’ అని యనమల చెప్పాడు.
మండలి చైర్మన్ షరీఫ్ నిన్న అప్రజాస్వామికంగా వ్యవహరించి మండలి వ్యవస్థకు మాయని మచ్చగా మిగిలాడనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో దాన్నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న మండలి చైర్మన్ షరీఫ్‌ను ‘నువ్వు సాయిబూలకే పుట్టావా’ అని దూషించినట్టు ఎల్లో పత్రికలో వచ్చింది. ఈ పరంపరలోనే లోకేశ్‌ను కొట్టేందుకు మంత్రులు మందు తాగి వచ్చారనే కొత్త నినాదాన్ని యనమల రామకృష్ణుడు తెరపైకి తెచ్చాడు. మున్ముందు ఇంకెన్ని రెచ్చగొట్టే చర్యలకు టీడీపీ పాల్పడుతుందో వేచి చూడాలి.