మూడు రాజధానుల వ్యవహారానికి ఇంకా చట్టబద్ధత లభించనే లేదు…ఈ లోపు కొందరు హైకోర్టు మెట్లు ఎక్కారు. రాజధానుల తరలింపు ఆపాలంటూ న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు, ఇంకా వేసేందుకు అనేక మంది క్యూలో నిలిచారు. ఇందులో భాగంగా రాజధానిపై వ్యాజ్యాల విచారణకు హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యానారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటైంది.
శాసనసభ ఆమోదం తెలిపిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం ఉపసంహరణ బిల్లును సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ బిల్లుపై శాసనమండలిలో చర్చ జరుగుతున్నందున ఒకటి రెండు రోజులు ఎందుకు వేచి చూడకూడదని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది.
దీనికి పిటిషనర్ల తరపు న్యాయవాది స్పందిస్తూ రాజధాని మార్చడానికి సహేతుకమైన కారణం ఉండాలని, ప్రభుత్వం మారినంత మాత్రాన రాజధాని మారుస్తామంటే కుదరదన్నాడు. చట్ట నిబంధనలు, రాజ్యాంగాన్ని గౌరవించాలని, మెజార్టీ ఉంది కదా అని ఏమైనా చేస్తామంటే కుదరదన్నాడు. రాజకీయ నిర్ణయంతోనే రాజధాని మారుస్తున్నారని, కోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వ చర్యలని నిలువరించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించాడు.
ధర్మాసనం స్పందిస్తూ చట్టం అనుమతించినంత వరకు జోక్యం చేసుకుంటామని వ్యాఖ్యానించింది. ఇది చాలా విలువైన వ్యాఖ్యానంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సర్కార్‌కు రకరకాల ఆదేశాలు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు చివరికి తమ పరిధి దాటి ప్రవర్తించలేమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
పరిపాలనా పరమైన అంశాల్లో న్యాయస్థానానికి కూడా ఒక పరిధి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నుకునే శాసన వ్యవస్థ అత్యంత బలమైంది. అందుకే పార్టీ ఫిరాయింపులపై కూడా స్పీకర్ నిర్ణయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోదు. కేవలం సూచనల వరకే పరిమితమవుతుంది. రాజధానిపై కూడా న్యాయస్థానం తన ఉద్దేశాన్ని మొదట్లోనే చాలా స్పష్టంగా ‘చట్టం అనుమతించినంత’ వరకే అని చెప్పడాన్ని గుర్తు పెట్టుకోవాలి.