అల్ప సంతోషమో.. అత్యుత్సాహమో తెలియదు కానీ.. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబుపై పూలవర్షం కురిపించారట, ఆయనకు బ్రహ్మరథం పట్టారట. ఎందుకూ.. మూడు నెలల పాటు మూడు రాజధానుల చట్టాన్ని వాయిదా వేయించినందుకట. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని పరాజయం తర్వాత.. ఇదేదో వారికి పెద్ద విజయంగా అనిపించి ఉండొచ్చు, అది వారి దౌర్భాగ్యం అని వేరే చెప్పక్కర్లేదు.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో తాను లేనే అని బాధపడుతున్నారట పవన్ కల్యాణ్. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉండకపోతే, తాను కూడా ఇంకా నకిలీ ఉద్యమంలో పాల్గొని ఉంటున్నట్టయితే.. తనపై కూడా పూలవర్షం పడేది కదా అని సన్నిహితుల దగ్గర వాపోయారట పవన్. ప్రస్తుతానికి టీడీపీకి దూరంగా ఉండటం, అందులోనూ ఢిల్లీలో ఉండటంతో.. పవన్ కి ఈ సంబరాల్లో చోటు దక్కలేదు.
బీజేపీతో పొత్తు ప్రకటించి ఉండకపోతే.. పవన్ బాబు కూడా శాసన మండలిలో బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లిన తర్వాత విజయ చిహ్నంతో రోడ్లపైకి వచ్చి ఉండేవారు. వైసీపీ మెడలు వంచానని, ఇదంతా తన వల్లే జరిగిందని, అమరావతిని ఇక ఎవరూ కదిలించలేరని ఓవర్ యాక్షన్ కూడా చేసి ఉండేవారేమో. ఇది జస్ట్ మూడు నెలల ముచ్చటే అని తెలిసి కూడా చంద్రబాబు వికటాట్టహాసం చేస్తున్నారంటే, ఇలాంటి విషయాలేవీ తెలియని పవన్ కల్యాణ్ రెచ్చిపోరని గ్యారెంటీ ఏముంది.
అందుకే ఆయన టీడీపీ సంబరాలు చూసి కుళ్లుకుంటున్నారట. తాను ఢిల్లీలో లాక్ అయిపోయానని తెగ బాధపడుతున్నారట. అటు బీజేపీ మాత్రం తాజా పరిణామాలపై నోరు తెరవలేని పరిస్థితిలో ఉంది. 2019 ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలోనే హైకోర్టు తరలింపు, అమరావతి భూ సేకరణపై న్యాయ విచారణ వంటి అంశాలున్నట్టు జగన్ నిండు సభలో స్లైడ్ షో వేసి చూపించడంతో ఆ పార్టీ నేతలు తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోవాల్సి వచ్చింది.
కమలంతో జతకట్టిన కారణంతో పవన్ నోటికి కూడా పరోక్షంగా తాళం పడింది. అలా అనుకోకుండా వెనక్కు తగ్గిన పవన్, ఇప్పుడు టీడీపీ చేస్తున్న రాద్ధాంతం చూసి తెగ ఇదైపోతున్నారు.