కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రణరంగానికి సమయం ఆసన్నం అవుతోంది. మే పదో తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత మూడో రోజులకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లు ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లో కూడా కర్ణాటక ముఖ్యమైనది. జేడీఎస్ ఇక్కడ కీ ప్లేయరే అయినప్పటికీ.. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యనే.
224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఖాతాలో 119 సీట్లున్నాయి. కాంగ్రెస్ చేతిలో 75 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలున్నారు. గత ఎన్నికల సమయంలో కర్ణాటకలో తీవ్ర నాటకీయ పరిణామాలు ఏర్పడ్డాయి. హంగ్ తరహా ఎన్నికల ఫలితాలు వచ్చాయప్పుడు. అయితే గవర్నర్ సహకారంతో ముందుగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
యడియూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బలనిరూపణలో విఫలం అయ్యి, రాజీనామా చేసి తప్పుకున్నారు. ఆ రాజకీయ పరిస్థితుల నడుమ కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. తక్కువ సీట్లున్న జేడీఎస్ కే సీఎం సీటును ఇచ్చి కాంగ్రెస్ వెనుక నిలిచింది. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని బీజేపీ ఉండనీయలేదు! కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ ఆ ప్రభుత్వాన్ని దిగ్విజయంగా కూలదోసింది. వారినే అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఉప ఎన్నికలతో నిలబెట్టుకుంది. మూడేళ్లకు మించే అధికారాన్ని అనుభవించింది.
అయితే కమలం పార్టీ వ్యవహారాలు కర్ణాటకలో చాలా కంగాళీగా మారాయి. 75 యేళ్ల రిటైర్మెంట్ ను పక్కన పెట్టి అవసరార్థం మేరకు యడియూరప్పను సీఎంగా చేసి, ఆ తర్వాత ఆయన స్థానంలో బసరాజ్ బొమ్మైని సీఎంగా చేశారు. కుల సమీకరణాలను బ్యాలెన్స్ చేసినా.. ఈ దఫా భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకతనే ఎదుర్కొంటూ ఉంది! వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం గత మూడేళ్లుగానే ఉందక్కడ. అంతకు ముందు కాంగ్రెస్ ఐదేళ్ల పాటు అధికారాన్ని కలిగి ఉంది. సంకీర్ణంలో దాదాపు రెండేళ్లు గడిచాయి. మరి ఇంతలోనే బీజేపీ ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్నట్టుగా ఉంది!
యడియూరప్ప సీఎంగా ఉన్నంత వరకూ విపరీత అవినీతి ఆరోపణలు భారతీయ జనతా పార్టీ ఇమేజ్ ను భ్రష్టుపట్టించాయి. యడియూరప్ప తనయుడు తనే సీఎంగా వ్యవహరిస్తూ ఉన్నాడని, తీవ్రంగా అవినీతి జరుగుతోందనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై బీజేపీ వాళ్లే ఢిల్లీకి ఫిర్యాదులు చేసి.. చేసి చివరకు యడియూరప్పను సీఎం సీటు నుంచి తప్పించగలిగారు. అయితే ఆ తర్వాత అవినీతి తగ్గక పోగా.. పాలనాపరంగా కూడా వైఫల్యాలు తేటతెల్లం అయ్యాయి. అధిష్టానం నామినేట్ చేసిన ముఖ్యమంత్రి కావడం కూడా బొమ్మై పై పెద్ద సానుకూలత రాకపోవడానికి కారణం!
అందులోనూ గత మూడేళ్లలో కర్ణాటక వ్యవహారాలు పూర్తిగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం కనుసన్నల్లోకి వెళ్లాయి. సీఎం లెక్కలేనన్ని సార్లు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ప్రజల్లో చులకన అయ్యారు. ఆ మధ్య ఒక లోక్ సభ సీటుకు ఉప ఎన్నిక జరిగితే , ఆ సిట్టింగ్ స్థానాన్ని సానుభూతిలో కూడా బీజేపీ దక్కించుకున్న మెజారిటీ ఐదు వేలు! అప్పుడే బీజేపీకి వార్నింగ్ బెల్స్ మోగాయి. ఇప్పుడు ఆ వ్యతిరేకతే బీజేపీని కర్ణాటకలో గద్దె దించనుందనే వరకూ వచ్చింది. వెల్లడవుతున్న ప్రీ పోల్ సర్వేలు కాంగ్రెస్ కు మెజారిటీ దక్కుతుందని చెబుతున్నాయి.
ఒకవేళ కాంగ్రెస్ మెజారిటీ దరిదాపుల్లోకి వచ్చి ఆగినా, బీజేపీకి వంద అసెంబ్లీ సీట్లకు మించి దక్కినా… కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ తనవైపుకు తిప్పుకోనూ గలదు! పది మంది, ఇరవై మంది ఎమ్మెల్యేలను అయినా బీజేపీ ఇట్టే రూటు మార్చి తమ వైపుకు తిప్పుకునేలా చేసి తిమ్మిని బమ్మిని చేయగలదు! ఈ ప్రమాదం కాంగ్రెస్ కు ఎలాగూ ఉన్నట్టే! అయితే ప్రజలు బీజేపీని ఏ 80 లోపు సీట్లకు పరిమితం చేస్తే మాత్రం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బే అవుతుంది. సర్వేలు అయితే బీజేపీ 80 సీట్ల స్థాయి అని చెబుతున్నాయి!
మరి కర్ణాటకలో గనుక కాంగ్రెస్ ఈ రేంజ్ లో పై చేయి సాధిస్తే.. ఆ వెంటనే జరిగే రాజస్తాన్, తెలంగాణ వంటి అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా ఆ పార్టీకి మంచి ఉత్సాహం వచ్చే అవకాశాలున్నాయి!