ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేయడం పెద్ద సమస్య కాదు. కాకపోతే అలా చేసిన సినిమాలు ఫ్లాప్ అయితే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం అందరిది. అందుకే టాలీవుడ్ లో మల్టీస్టారర్లు పెద్దగా రావు.
ఇప్పుడు వెంకటేష్-రానా మల్టీస్టారర్ వస్తోందనే న్యూస్ బయటకు రావడంతో దగ్గుబాటి ఫ్యాన్స్ అలెర్ట్ అయ్యారు. ఈసారైనా హిట్ సినిమా తీయమని రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ ఇలా భయపడ్డానికి కారణం 'వెంకీమామ' సినిమా. రియల్ లైఫ్ మామ-మేనల్లుడు వెంకీ-నాగచైతన్య కలిసి చేసిన ఆ సినిమా ఫ్లాప్ అయింది. క్రేజీ అనిపించుకోవాల్సిన కాంబినేషన్ కాస్తా, ఫ్లాప్ జోడీ అనిపించుకుంది. ఈసారి వెంకీ-రానా విషయంలో అది మరోసారి రిపీట్ అవ్వకూడదనేది ఫ్యాన్స్ తాపత్రయం.
బాబాయ్ వెంకటేష్ తో కలిసి తను చేయబోయే సినిమాకు కథ సిద్ధమైందని స్వయంగా రానా ప్రకటించాడు. అప్పట్నుంచే వెంకీ ఫ్యాన్స్ లో గుబులు మొదలైంది. ఇక్కడే మరో నెగెటివ్ సెంటిమెంట్ కూడా తెరపైకొచ్చింది.
గతంలో రానా నటించిన “కృష్ణంవందే జగద్గురుం” అనే సినిమాలో వెంకీ గెస్ట్ రోల్ చేశాడు. ఓ పాటలో ఇలా వచ్చి అలా స్టెప్పులేసి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
ఇప్పుడు మరోసారి బాబాయ్-అబ్బాయి కలుస్తున్నారు. ఏకంగా మల్టీస్టారర్ చేస్తున్నారు. ఈసారి ఎలాంటి నెగెటివ్ ఎఫెక్ట్ పడకూడదని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.