ఏపీ బీజేపీ నాయకుల తీరు చాలా విచిత్రంగా ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గందరగోళంగానే ఉన్నాడు. మిగతా నాయకులు కూడా డిటోయే. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కూడా గందరగోళమే. మూడు రాజధానుల విషయంలో జగన్‌కు, వైకాపాకు క్లారిటీ లేదంటున్న కన్నా ముందు తాను క్లారిటీగా ఉన్నాడా? అనేది చెక్ చేసుకోవాలి. మూడు రాజధానుల కాన్సెప్టును విమర్శిస్తున్నాడు. దీనిపై రాష్ట్ర పార్టీ తీర్మానం చేసిందన్నాడు. ప్రభుత్వం ప్రజలను గందరగోళం చేస్తోందన్నాడు. కరెక్టే. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ తీర్మానం చేసింది వాస్తవమే.
ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఫీలైతే విమర్శించడం కరెక్టే. కాని ప్రభుత్వం ఒక విధానం ప్రకారం తన పని తాను చేసుకుంటూ పోతోంది. సర్కారుకు క్లారిటీ లేదంటున్న బీజేపీ నాయకులు మాత్రం క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని కన్నా అన్నాడు. ఇతర నాయకులూ అన్నారు. ఇదే విషయాన్ని కొందరు కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది అంటున్నారు. ఎలా చెప్పినా అర్థం ఒకటే. కొన్ని రోజుల కిందట రాజ్యసభ ఎంపీ కమ్ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, కేంద్రం జోక్యం చేసుకోదని, కేంద్రంతో మాట్లాడిన తరువాతే తాను చెబుతున్నానని అన్నాడు.
అంతకు ముందు ఎంపీ సుజానా చౌదరి అమరావతిని ఇంచు కూడా కదలించలేరని రెండు మూడుసార్లు చెప్పాడు. కన్నా మాత్రం వీరిద్దరితో విభేదించి అమరావతి ఎక్కడికీ పోదని, కేంద్రం జోక్యం చేసుకుంటుందని అన్నాడు. బీజేపీని నమ్ముకున్న పవన్‌ది కూడా ఇదే మాట. మరి కన్నా ఈ మాట మీదనే ఉండాలి కదా. కాని లేడు. మళ్లీ తాజాగా రాజధాని వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమన్నాడు. తనంతట తాను కేంద్రం జోక్యం చేసుకోదన్నాడు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే తప్ప కేంద్రం తనకు తానై కల్పించుకోదని చెప్పాడు.
ఇదేం గందరగోళం? కేంద్రం జోక్యం చేసుకుంటుందా? చేసుకోదా? ఈ రెండింటిలో ఏదో ఒకటి క్లారిటీగా చెప్పాలి. అంతే తప్ప చేసుకుంటుందని, చేసుకోదని చెబుతూ ప్రజలను గందరగోళం చేయడమెందుకు? కేంద్రం జోక్యం చేసుకోదనే విషయం సర్కారుకు, వైకాపా నేతలకు తెలుసు కాబట్టే ఎలాంటి స్పందన లేదు. ఇదే విషయం రాష్ట్ర బీజేపీ నేతలకు, పవన్ కళ్యాణ్‌కు తెలిసి కూడా కేంద్రం జోక్యం చేసుకుంటుందని చెబితే మాత్రం ప్రజలను మోసం చేస్తున్నట్లే. కన్నా అమాయకుడు కాదు కదా. చాలా సీనియర్ నాయకుడు. రేపు బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు.
ఇది భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తుంది. ఎలా పోరాటం చేయాలో డిసైడ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నాడు. ఇక రాష్ట్రంలోని జనసేన నాయకులకు జనసేన-బీజేపీ కార్యాచరణ గురించి తెలియదు. అమరావతిని కదలకుండా ఎలా చేస్తారో తెలియదు. జగన్ ప్రభుత్వాన్ని పవన్ ఎలా కూలగొడతాడో తెలియదు. ఎలా కూలగొడతాడయ్యా? అని అడిగితే చాలు పవన్‌ను అతి శక్తిమంతుడిగా వర్ణిస్తున్నారు. సినిమాలో జరిగినట్లుగా జరుగుతుందని జనసేన నాయకులు ఊహించుకుంటున్నారు.
ఎంతసేపటికీ ప్రజాక్షేత్రంలో పోరాడతామని, అసెంబ్లీలో బలం ఉందా? లేదా? అనేది ముఖ్యం కాదని, ప్రజలే తమ బలమని సినిమాటిక్ డైలాగులు చెబుతున్నారు. పవన్ అమరావతి ఉద్యమకారులతో మాట్లాడుతూ 'నేనేం చేస్తానో చెప్పను. చేసి చూపిస్తా' అన్నాడు. అమరావతి ఎలా ఆగుతుందో, ఆపుతారో బీజేపీ నేతలకు. పవన్‌కూ క్లారిటీ లేదు. మరి వీళ్లు ప్రజలకు ఏం చెబుతారు?