అమెరికా నూతన అధ్యక్షుడిగా విజయాన్ని ఖరారు చేసుకున్నారు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్. కొనసాగుతూ ఉన్న కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా.. పెన్సిల్వేనియా రాష్ట్ర ఫలితాలపై స్పష్టత రావడంతో.. బైడెన్ విజయం ఖరారు అయ్యింది. ఇప్పటి వరకూ బైడెన్ 284 ఎలక్ట్రోరల్ ఓట్లతో ముందంజలో ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గాలంటే కనీసం 270 ఓట్ల మద్దతు అవసరం కాగా.. అంతకు మించి సాధించారు బైడెన్. ఆయన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇంకా 214కే పరిమితం అయ్యారు. ఇంకా పూర్తి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నా.. బైడెన్ విజయం ఖరారు అయ్యింది.
జో బైడెన్ అమెరికాకు 46వ అధ్యక్షుడు అవుతున్నారు. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ కూడా విజయం సాధించినట్టే. ఈ విజయంతో తొలిసారి ఒక నల్లజాతీయురాలు, ఆసియన్ మూలాలున్న మహిళ అమెరికా ఉపాధ్యక్ష పదవిని అధిష్టించనున్నారు.
కేవలం రెండు సార్లు మాత్రమే అధ్యక్ష పదవిని అధిష్టించడానికి వీలుండే దేశంలో తొలి టర్మ్ తోనే ఓటమిని మూటగట్టుకున్న జాబితాలో నిలిచారు డొనాల్డ్ ట్రంప్. విజయం తనదేనంటూ ఆయన ఎంత విశ్వాసంగా చెప్పినా, అమెరికన్లు మాత్రం ట్రంప్ ను విశ్వాసంలోకి తీసుకున్నట్టుగా లేరు.
గత కొన్నేళ్లలో బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, ఒబామా వంటి అధ్యక్షులు వరసగా రెండు టర్మ్ లలోనూ విజయాలు సాధించారు. అయితే ట్రంప్ కు మాత్రం అలాంటి అవకాశం దక్కుతున్నట్టుగా లేదు. ఇక ఎన్నికల ప్రక్రియపై ట్రంప్ బృందం తన అభ్యంతరాలను కొనసాగిస్తూ ఉంది. బైడెన్ మోసపూరితంగా నెగ్గినట్టుగా ప్రకటించుకుంటున్నారని ట్రంప్ బృందం ఆరోపిస్తోంది.