శీర్షిక చూసి ఇదేదో కరోనాకు సంబంధించిన కేసు అనుకునేరు. ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యవ్వారం. ఇంతకూ కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకోవడమేమిటి? దాని ఊపిరి ఆగిపోయే పరిస్థితి వచ్చిందా? అవును … ఈ మధ్యనే ఊపిరి ఆగిపోయి ఉక్కిరిబిక్కిరి అయింది కదా.
కాంగ్రెస్ ఊపిరి ఎవరు? పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరుపడిన విజయశాంతి అలియాస్ రాములమ్మ. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ఆమె బీజేపీలోకి వెళ్ళిపోతోందని పెద్దఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే కదా.
ఆమెను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలిశారు. బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కలిశారు. దీంతో ఆమె కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారమైంది. బీజేపీ నాయకులు ముహూర్తం కూడా నిర్ణయించేశారు.
ఫైర్ బ్రాండ్ వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ గతి ఏమిటిరోయ్ బాబోయ్ అంటూ కాంగ్రెస్ నాయకులు నెత్తీ నోరు కొట్టుకున్నారు. ఆమెను వెళ్లకుండా చేయడానికి నానా అగచాట్లు పడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ వెళ్లి బుజ్జగించారు.
ఇంకా కొందరు నాయకులు వెళ్లి మాట్లాడారు. ఆమె మాత్రం ఎప్పటి మాదిరిగానే పార్టీ నాయకులపై ఆరోపణలు చేశారు. పార్టీలో తనకు అవమానాలు కలుగుతున్నాయని చెప్పారు. తనకు ప్రాధాన్యం లేదన్నారు.
దుబ్బాకలో పోటీకి కాంగ్రెస్ పార్టీ ముందుగా విజయశాంతిని అడిగింది. నో చెప్పింది. పోనీ ప్రచారం చేయాలని అడిగారు. మళ్ళీ నో చెప్పింది. దుబ్బాక ఎన్నిక ముగిశాక లేడీ సూపర్ స్టార్ మనసు మారినట్లుంది. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. అయితే కొందరు నాయకుల తీరుపై మాత్రం మండిపడ్డారు.
కొందరు నాయకులు తనగురించి టీవీ ఛానెళ్లలో వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాక విజయశాంతి ఒక్కనాడూ సంతృప్తిగా కనబడలేదు.
ఎప్పుడూ తనకు ప్రాధాన్యం లేదని చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో చాలా వ్యతిరేకత ఉంది. అయినా తనపని తాను చేసుకుంటూనే పోతున్నాడు. కానీ విజయశాంతి ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.
తనను తాను పెద్ద నాయకురాలిగా ఊహించుకుంటోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ నాయకులు ఊపిరి పీల్చుకున్నా, విజయశాంతి చేసేదేమీ ఉండదు.