అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతూ.. ఉంది. పోటాపోటీ వాతావరణంలో ఫలితాలపై పూర్తి స్పష్టత రావడం లేదు. అధికార సమాచారం మేరకు.. బైడెన్ విజయానికి చేరువలో ఉన్నాడు. విజయం పట్ల ఆయన పూర్తి విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.
పెన్సిల్వేనియాలో తను విజయం సాధించబోతున్నట్టుగా ఆయన తాజాగా ప్రకటించారు. ఒకవేళ అదొక్కటీ జరిగినా.. ఆయన అమెరికా అధ్యక్షుడు అయినట్టే. ఇప్పటి వరకూ బైడెన్ సంపాదించిన ఎలక్ట్రోరల్ ఓట్ల సంఖ్య దాదాపు 264 వరకూ ఉంది.
పెన్సిల్వేనియాలో పై చేయి సాధిస్తే.. ఏకంగా మరో 20 ఓట్లు ఆయన ఆయన ఖాతాలో జమ అవుతాయి. అప్పుడు కనీస మెజారిటీ కన్నా.. ఎక్కువ ఓట్లు బైడెన్ సొంతం అవుతాయి.
జార్జియా, నెవడా ఫలితాలతో నిమిత్తం లేకుండానే విజయం బైడెన్ సొంతం అవుతుంది. ఒకవేళ అవీ గెలిస్తే.. మరింత మెరుగైన మెజారిటీతో బైడెన్ విజయం సాధించినట్టుగా అవుతుంది. ఇప్పటికే బైడెన్ కు అమెరికన్ సీక్రెట్ సర్వీసులు రక్షణ ఏర్పాట్లు కూడా చేస్తున్నాయట. ఈ నేపథ్యంలో ఆయన విజయం ఖరారు అయినట్టే అని స్పష్టం అవుతోంది.
మరోవైపు ట్రంప్ బృందం గగ్గోలు పెడుతూ ఉంది. రీ కౌంటింగ్ డిమాండ్లు, కౌంటింగ్ ను ఆపేయాలనే డిమాండ్ లను వినిపిస్తూ ఉంది. జార్జియాలో రీకౌంటింగ్ కు ఆదేశాలు వచ్చాయి.
మొదట్లో సాధించిన ఆధిక్యంతో ట్రంప్ బృందం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. విజయం తమదేనని ఫిక్సయ్యింది. అయితే ఇక్కడే ఒక మెలిక ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రంప్ అనుకూలురు పోలింగ్ స్టేషన్లకు వెళ్లి ఓటేశారు. కరోనాను లెక్క చేయకుండా వారు అలా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ ఓట్లను లెక్కించినప్పుడు ట్రంప్ దే పై చేయి గా కనిపించింది. డెమోక్రాట్లు కరోనా రక్షణ చర్యలకు కట్టుబడ్డారు. వారు ఎక్కువగా పోస్టల్ ఓట్ ను ఉపయోగించుకున్నారు.
దీంతో పోస్టల్ ఓట్ల లెక్కింపు మొదలయ్యాకా ట్రంప్ పరిస్థితి తలకిందుల అయ్యింది. డెమోక్రాట్లు పై చేయి సాధిస్తూ ఉన్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ట్రంప్ బృందం పోస్టల్ ఓట్ల లెక్కింపును ఆపాలంటూ డిమాండ్ చేస్తూ ఉందట! .
తమకు వ్యతిరేకంగా పోల్ అయి ఉంటాయి కాబట్టి.. వాటి లెక్కింపును ఆపాలంటూ, మోసం జరిగిందంటూ ట్రంప్ బృందం వాదిస్తూ ఉన్నట్టుంది. ఫెడరల్ కోర్టుల్లో ఆ వాదన నిలబడేలా లేదు.